అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న సరైనోడు పాట చిత్రీకరణ కోసం యూనిట్ మొత్తం బొలీవియాకు బయల్దేరిన విషయం విదితమే. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సాల్ట్ లేక్ (ఉప్పు సరస్సు) ఇక్కడుంది. ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడనటువంటి ఈ సుపర్బ్ సీనరీని సరైనోడు కోసం ఎంచుకోవడమే కాకుండా అక్కడి నుండి ఫస్ట్ స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో వదిలారు. నిన్నటి వరకు బన్నీ ఇక్కడే హైదరాబాద్ నగరంలో ఉన్నాడు కాబట్టి ఈ స్టిల్స్ అన్నింటిలో హీరోగారు మిస్ అయినా అక్కడ షూటింగ్ పనులను పర్యవేక్షిస్తున్నసహనిర్మాత బన్నీ వాసు అండ్ ఇతర టెక్నికల్ టీంని మనం చూడొచ్చు. బొలీవియా సాల్ట్ ఫ్లాట్ మిరర్స్ అని ప్రాచుర్యం పొందిన ఈ ప్రదేశం పేరు సాలార్ డే ఉయుని. ఇది సుమారుగా 11000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. టూరిస్టులని విపరీతంగా ఆకర్షించే ఈ ప్రదేశంలో సరైనోడు షూటింగ్ జరుపుకోవడం ఓ విశేషం అయితే, ఆ పాటను తెర మీద ఆవిష్కరించే తీరు మరింత కనువిందుగా ఉంటుంది అంటున్నారు బోయపాటి వారు. బొలీవియా అందాలను పడుతున్న బోయపాటి వారు... ఈ టైటిలేదో బాగానే ఉన్నట్టుందే!