కొణిదెల నిహారిక సినీ ఆరంగేట్రం అంటే ఆషామాషీగా ఉంటుందా? అందునా మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మొదటి హీరోయిన్ అయేసరికి అభిమానులకు కూడా ఓ లెక్క, అంచనా ఉంటుంది. మొత్తానికి పెదనాన్న చిరంజీవి గారి అంగీకారంతో ఒక మనసు చిత్రం ద్వారా తెరంగేట్రం చేయబోతున్న నిహారికా మూవీ ప్రీలుక్ కాసేపటి క్రితమే విడుదలయింది. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వులాంటి హృద్యమైన ప్రేమ కథా చిత్రంతో మన మనసును కొల్లగొట్టిన దర్శకుడు రామరాజు గారి తదుపరి చిత్రమే ఈ ఒక మనసు. నాగశౌర్య హీరోగా మధురా శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారధ్యంలో వేసవి సెలవుల్లో రిలీజుకు సిద్ధమవుతున్న ఈ ఫిలిం ప్రీలుక్ అభిమానులకు పెద్దగా అనేట్టు లేదు. ముఖ్యంగా పోస్టర్ పైన నిహారిక చీర కట్టుకొని కొండమీద పరుగులు తీస్తున్నట్టు కనపడినా, వెనక నాగశౌర్య కూడా అగుపిస్తున్నా ఎక్కడా వారి ముఖాలు స్పష్టంగా దర్శనమీయక పోవడంతో మెగా ఫ్యాన్స్ కాస్తంత నిరాశ చెందుతున్నారు. ఔనులెండి, ఇది ప్రీలుక్ కదా, అసలు ఫస్ట్ లుక్ విషయం వచ్చేసరికి దర్శక నిర్మాతలు మరింత జాగ్రత్తగా ఉంటారేమో. ఒకటి మాత్రం క్లియర్, నిహారిక మాడరన్ అమ్మాయిగా కాకుండా చక్కటి చీరకట్టులో తన పాత్ర పోషించింది అన్నది తెలుస్తోంది. ఒక మనసు ఓ విలేజ్ వాతావరణంలో తీసినట్టే ఉన్నారు.