అటు రాజకీయంగా పవన్ కళ్యాణ్ పేరు వినబడినా, వినబడక పోయినా పెద్ద తేడా లేదు అనే స్థాయికి ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ దిగజారిపోయాయి, ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్ పెద్ద హిట్టు కొడితేనే తప్ప మళ్ళీ తలెత్తుకు తిరిగే పరిస్థితి అభిమానులకు లేదు. ఎటు నుండి చూసినా పవన్ కళ్యాణ్ గారికి, ఆయన అభిమానులకి సర్దార్ గబ్బర్ సింగ్ మీదే కొండంత ఆశ నెలకొని ఉంది. అత్తారింటికి దారేది తదనంతరం పవర్ స్టార్ ఇమేజి ఆకాశానికి ఎగిసింది. అంతటి అవకాశాన్ని, ఆ బ్రహ్మాండమైన ఇమేజిని నిలుపుకునేలా పవన్ ఒక్క (పని) సినిమా కూడా చేయలేదు అన్నది అక్షర సత్యం. ఇక సర్దార్ విషయానికే వస్తే స్క్రిప్ట్ మీద రెండేళ్ళు, టెక్నికల్ టీం మీద ఓ ఏడాది, తరువాత హీరోయిన్ అండ్ కెమెరామెన్ మార్చటాలు, మళ్ళీ షూటింగ్ అడ్డంకులు, వాయిదాలు, ఇలా చెప్పుకుంటూ పోతే సర్దార్ పేరుతో ఫ్యాన్సుని పవన్ సతాయిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏప్రిల్ 8న సినిమా రిలీజ్ అని నిర్మాత శరత్ మరార్ డప్పేసి చెప్పినా ఇప్పటికి జరిగిన షూటింగ్ ప్రోగ్రెస్ కార్డ్ చూస్తే, అది అసంభవం అంటున్నాయి యూనిట్ వర్గాలు. EROSతో రిలీజ్, బిజినెస్ ఒప్పందం కూడా జరిగిపోయిన దరిమిలా ఏటికి ఎదురీదినట్టు పవన్ కళ్యాణ్, శరత్ మరార్, దర్శకుడు బాబీ ఎలా ఈ చిత్రంతో వేగుతారో వెయిట్ అండ్ సి!