అలా మొదలైందితో ఉత్తమాభిరుచి గల దర్శకురాలిగా పేరు పొందిన నందిని రెడ్డి రెండవ చిత్రం జబర్దస్త్ పేరిట ఫ్లాప్ చవిచూసింది. కృష్ణ వంశీ స్కూల్ నుండి రావడంతో ఎటువంటి కథలకయితే ఈవిడ సరైన న్యాయం చేయగలదో అన్న ఓ సాఫ్ట్ కార్నర్ బేస్ చేసుకొని జనాలకు రిలీజుకు ముందే చేరువైన సినిమా కళ్యాణ వైభోగమే. అందునా నిన్నే పెళ్ళాడతా, మురారి లాంటి ఫ్యామిలీ ఎపిసోడ్స్, ఫీల్ గుడ్ ఎమోషన్ మొత్తం పాటల్లో, ట్రైలర్లలో చూపించడంతో ధియేటర్ వద్దకు వెళ్ళే ప్రేక్షకులకు ఇది ఏ జోనర్ అన్న విషయం బాగా రిజిష్టర్ అయ్యింది. అందుకే సినిమా మొదలయిన ఫస్ట్ మూమెంట్ నుండే కథలోకి అవలీలగా వెళ్లి నందిని రెడ్డి ఆహ్లాదకరమైన ట్రీట్మెంటుకు కనెక్ట్ అయిపోయాడు. నేటి యూత్ ఆలోచనలకి, వారికి పెళ్లి పట్ల ఉండే దృక్పదానికి నిలువుటద్దంలా సినిమా ఉండడంతో నిర్మాతలు టార్గెట్ చేసుకున్న ఆడియెన్సు సినిమాను చక్కగానే ఓన్ చేసుకున్నారు. ముఖ్య తారాగణంలో నాగ శౌర్య, మాళవిక నాయర్, రాజ్ మదిరాజు, రాశి, ఐశ్వర్య కూడా ఒదిగిపోయారు. అన్నీ మంచి శకునాలే ఉన్న ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయం లభిస్తుందో తెలియదు గానీ నందిని రెడ్డికి మాత్రం ఖచ్చితంగా కళ్యాణ వైభోగమే మంచి ఊరట!