తమిళ సినీ పరిశ్రమలో నడిగర్ సంఘానికి సంబంధించిన గొడవలు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్‌కీ, ప్రస్తుత కార్యవర్గానికీ మధ్య వార్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా శరత్‌కుమార్‌పై విశాల్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టాడు. నడిగర్ సంఘానికి సంబంధించిన ఎకౌంట్స్‌ని ఇంకా అప్పజెప్పడం లేదని ఆరోపిస్తూ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో మళ్లీ తమిళ చిత్ర పరిశ్రమలో వేడి మొదలైంది. కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని శరత్‌కుమార్ ఎదురు దాడి చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.
ఇటీవలే ఎన్నికైన నడిగర్ సంఘం కొత్త కార్యవర్గానికి యువ కథానాయకుడు విశాల్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పదవి నుంచి శరత్‌కుమార్‌ని దించేయాల్సిందేనని కంకణం కట్టుకొని అనుకొన్నది సాధించాడు విశాల్. పొలిటికల్ ఎలెక్షన్లను తలపించేలా నడిగర్ సంఘం ఎన్నికలు జరిగాయి. అందులో ఎట్టకేలకు విశాల్ టీమ్ గెలిచింది. అయితే కొత్త కార్యవర్గం బాధ్యతల్ని చేపట్టి నెలలు గడుస్తున్నా పాత కార్యవర్గం ఇంకా ఎకౌంట్స్‌ని అప్పజెప్పలేదట. ఆ విషయం గురించి ఎన్ని మార్లు అడిగినా శరత్‌కుమార్ పట్టించుకోవడం లేదట. దీనిపై విశాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల్ని ఆశ్రయించారు. కోట్ల రూపాయల కుంభకోణం చేశారని, అది బయట పడుతుందనే అకౌంట్స్ అప్పజెప్పడం లేదని విశాల్ వర్గం ఆరోపిస్తోంది. అయితే శరత్‌కుమార్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఎదురు దాడికి దిగుతున్నారు. తెలుగు చిత్రసీమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లాగే అక్కడ నడిగర్ సంఘం పనిచేస్తుంటుందన్నమాట.