సినిమా ఫీల్డ్‌లో ఓ ట్రెండ్ మొదలైందంటే చాలు ఇక దానిని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ ట్రెండ్ అలాగే నడుస్తోంది. తెలుగులో ఎప్పుడో దశాబ్దాల కిందట విడుదలైన హిట్ చిత్రాలను ఇంతకాలం తర్వాత కూడా రీమేక్‌లు చేయడానికి ఎగబడుతున్నారు బాలీవుడ్ జనాలు. కాపీ చేయడానికి కథ ముఖ్యం కానీ అది ఎప్పుడు రిలీజ్ అయిందనేది ముఖ్యం కాదు అని నిరూపిస్తున్నారు. ఎప్పుడో తెలుగులో హిట్ అయిన 'ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, స్టాలిన్' వంటి చిత్రాలను తెలుగులో విడుదలైన ఎంతో కాలానికి రీమేక్ చేశారు. ఇక తమిళంలో 'రమణ'గా, తెలుగులో 'ఠాగూర్'గా వచ్చిన చిత్రం పరిస్థితి కూడా అదే కోవకు చెందుతుంది. తాజాగా ఎప్పుడో దశాబ్దం కిందట వచ్చిన ప్రభాస్-త్రిషల 'వర్షం' చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో 'భాగి'గా రీమేక్ చేయడం చూస్తుంటే ఈ ట్రెండ్‌కు ఇదే పరాకాష్ట అనే విషయం స్పష్టంగా అర్దమవుతోంది. మరి ఇది మన ఘనతో లేక బాలీవుడ్ చేతకానితనమో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.