కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓడలు బండ్లు అవుతుంటాయి... బండ్లు ఓడలు అవుతుంటాయి. ఇదే పరిస్థితిని ప్రస్తుతం టాలీవుడ్ స్టార్‌రైటర్ కోనవెంకట్ ఎదుర్కొంటున్నాడు. నిన్నమొన్నటి వరకు ప్రతిరోజు ఏదో ఒక సినిమా ఫంక్షన్‌లో కనిపిస్తూ, ఎప్పుడూ మీడియాలో దర్శనమిచ్చేవాడు కోనవెంకట్. కానీ ఆయన ఇటీవల కాలంలో తన సారధ్యంలో చేసిన 'శంకరాభరణం' డిజాస్టర్ కావడం, తాను పనిచేసిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడం, శ్రీనువైట్లతో విబేధాలు, వారిద్దరి మధ్య వాగ్వివాదాలు కారణంగా ఆయనపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అంతేకాక తాను తెలుగులో ప్రేక్షకులకు అందిస్తున్న నాగచైతన్య-గౌతమ్‌మీనన్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం విడుదల ఎప్పుడు అవుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఆయన ఈమధ్య పెద్దగా కనిపించడం మానేశాడు. ఇటీవలే ఆయన అమెరికా వెళ్లివచ్చినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఆయన ముంబైలో ఉన్నాడు. ఎందుకనుకుంటున్నారా...? ఇంకేముంది.. ఓ బాలీవుడ్ చిత్రాన్ని లైన్‌లో పెట్టడానికి ఆయన అక్కడ మకాం వేశాడు. బాలీవుడ్ సినిమా కోసం ఓ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌ను రెడీ చేసి అందులో నటించడానికి నిన్నటితరం అతిలోకసుందరి శ్రీదేవిని లైన్‌లో పెట్టాడు. ఈ చిత్రం పేరు 'మామ్'. ఈ చిత్రానికి కోన కథను అందిస్తున్నాడు. ఇందులో శ్రీదేవి తల్లి పాత్రలో కనిపించనుంది. రవి ఉడయార్ దర్శకత్వం వహిస్తాడు. కాగా ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ ఓ కీలకపాత్రను పోషించనున్నాడు. మొత్తానికి శ్రీదేవినే కాదు... ఆమె భర్త బోనీకపూర్‌ను కూడా లైన్‌లో పెట్టి ఈ సినిమా నిర్మాణబాధ్యతలను చేపట్టడానికి ఆయన్ను ఒప్పించాడు. ఇందులో శ్రీదేవికి జోడీగా నవాజుద్దీన్ సిద్దిఖీ నటించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీపొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్బింగ్ చేసి తానే స్వయంగా రిలీజ్ చేయడానికి కోన సంసిద్దుడవుతున్నాడు.