కొత్త దర్శకులకు మంచి విజయం లభించినా కూడా తర్వాత అవకాశాలు రాక, ఇబ్బందులు పడే వారిని ఎందరినో చేస్తున్నాం. కానీ తాజాగా ఓ కుర్ర దర్శకుడు మాత్రం ఇద్దరు హీరోల వరుస ఆఫర్లతో ఎవరితో ముందు సినిమా చేయాలా? అనే సంశయంతో నలిగిపోతున్నాడు. ఈ ఏడాది విడుదలైన తొలి చిత్రంగా, తొలి ఘనవిజయాన్ని నమోదు చేసుకున్న చిత్రంగా రామ్ నటించిన 'నేను..శైలజ' చిత్రం నిలిచింది. దీంతో ఈ చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమలకు వరుసగా రెండు ఆఫర్లు వచ్చాయి. తన తదుపరి చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తాడని స్వయంగా యంగ్ హీరో నితిన్ ట్విట్టర్ సాక్షిగా ప్రకటించాడు. మరోవైపు సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ కూడా తన తదుపరి చిత్రం కిషోర్ తిరుమలతోనే చేస్తానని మాట ఇచ్చాడు. కాగా ప్రస్తుతం నితిన్ త్రివిక్రమ్‌శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న 'అ...ఆ' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ ద్వితీయార్ధంలో విడుదలకు సిద్దం అవుతోంది. మరోపక్క వెంకటేష్ మారుతి దర్శకత్వంలో చేస్తున్న 'బాబు బంగారం' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం జూన్1 వతేదీన విడుదల కానుంది. మరి ఈ ఇద్దరిలో కిషోర్ తిరుమల ఎవరి చిత్రం ముందుచేస్తాడు? అనే విషయంలో ఆసక్తి నెలకొనివుంది. వెంకీ తదుపరి చిత్రానికి రెండు నెలల గ్యాప్ ఉండటంతో ముందుగా నితిన్‌తోనే కిషోర్ ముందుకు వెళ్లవచ్చు అనే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.