‘బాహుబలి’, 'రుద్రమదేవి' చిత్రాలతో తెచ్చుకున్న పాపులారిటీ మొత్తాన్ని ‘సైజ్‌జీరో’ చిత్రంతో పొగొట్టుకుంది అనుష్క శెట్టి. ఆ చిత్రంలో తన భారీకాయంతో వెండితెరపై ప్రేక్షకులను భయపెట్టిన అనుష్కను.. బుల్లితెరపై ప్రిన్స్ మహేష్‌బాబు ఆదుకోబోతున్నాడు. అదేనండి...! ప్రస్తుతం సినిమా శాటిలైట్ వ్యాపారం స్లంప్‌లో వుంది. ఒకప్పుడు పోటీలు పడి సినిమా శాటిలైట్ హక్కులు దక్కించుకున్న ఛానెల్స్ అధినేతలు ఇప్పుడు సినిమా శాటిలైట్ అంటేనే ఆమడ దూరం పారిపోతున్నారు. స్టార్ హీరోల సినిమాలు తప్ప మిగతా సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఒకవేళ స్టార్‌హీరో సినిమా అయినా శాటిలైట్ రేటు తమకు రీజనబుల్‌గా అనిపించకపోతే.. వాటిని కూడా పట్టించుకోవడం లేదు. ఆ కోవలోకి చేరిందే అనుష్క నటించిన ‘సైజ్‌జీరో’. విడుదలకు ముందు చిత్ర శాటిలైట్ హక్కులు అమ్మలేదు.. సారీ అమ్ముడుపోలేదు. అంతేకాదు ఇదే పీవీపీ బ్యానర్‌లో గతంలో అనుష్క నటించిన ‘వర్ణ’ శాటిలైట్ హక్కులు కూడా పీవీపీ సంస్థ దగ్గరే వున్నాయి.. సో.. వీటిని వదిలించుకోవాలనుకున్న నిర్మాత పీవీపీ తను తాజాగా మహేష్‌బాబుతో నిర్మిస్తున్న‘బ్రహ్మోత్సవం’తో లింకు పెట్టాడు. ‘బ్రహ్మోత్సవం’ శాటిలైట్ హక్కులు కావాలంటే... సైజ్‌జీరో, వర్ణ శాటిలైట్ హక్కులు కూడా కొనాల్సిందేనని చెప్పడంతో సదరు టీవీ ఛానెల్ వాళ్లు ‘బ్రహ్మోత్సవం’తో కలిపి 13 కోట్ల రూపాయాలకు సదరు చిత్ర శాటిలైట్ హక్కులను కొనుగోలు చేశారని తెలిసింది.