సీనియర్ స్టార్స్‌లో విక్టరీ వెంకటేష్ స్టైలే వేరు. ఆయన ఇగోలకు దూరంగా ఉంటాడు. తనతోటి సీనియర్ స్టార్స్‌తో కూడా పోటీపడడు. తన పనితాను చూసుకునే మనస్తత్వం ఆయనది. నెంబర్ గేమ్‌లకు ఆయన చాలా దూరం. కాగా ఆయన ఇటీవల బాలీవుడ్‌లో మాధవన్ హీరోగా నటించి మంచి విజయం సాధించిన 'సాలా ఖద్దూస్' చిత్రం రీమేక్‌లో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కూడా బాలీవుడ్‌లో.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన తెలుగమ్మాయి సుధా కొంగరనే దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఇందులో మాధవన్ బాక్సర్‌గా, బాక్సింగ్ కోచ్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రను తెలుగులో తాను చేయాలని ఆసక్తి చూపుతున్న విక్టరీ వెంకటేష్ ఈ చిత్రం కోసం బరువు పెరుగుతున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం వెంకటేష్.. మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' చిత్రం చేస్తున్నాడు. 'లక్ష్మీ, తులసి' చిత్రాల తర్వాత ఇందులో నయనతార వెంకీకి జోడీగా హ్యాట్రిక్‌కు సిద్దం అవుతోంది. సంక్రాంతికి, వేసవికి చాలా మంది స్టార్స్ వచ్చి సీజన్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎవ్వరికీ పోటీకాకుండా, ఎవరితో పోటీ పడకుండా తన చిత్రాన్ని విడుదల చేయాలని ఆయన భావిస్తున్నాడు. వాస్తవానికి వెంకీ సోలో హీరోగా వచ్చి 20నెలలు దాటింది. ఆయన నటించిన 'దృశ్యం' చిత్రం 2014, జులై 11న విడుదలైంది. దీంతో మరోసారి అదే టైమ్‌లో రావాలని వెంకీ భావిస్తున్నాడు. అందులో భాగంగా 'బాబు బంగారం' చిత్రాన్ని జూలై 1న విడుదల చేయడానికి సిద్దం అవుతున్నాడు.