'భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి వరస సూపర్‌హిట్స్‌తో నాని మాంచి ఊపుమీదున్నాడు. ప్రస్తుతం ఆయన తనకు హీరోగా అవకాశం ఇచ్చిన గురువు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నానికి జోడీగా సురభి నటిస్తోంది. ఈ ఒక్క సినిమాపైనే ముగ్గురి భవిష్యత్తు ఆధారపడి ఉంది. వీరందరూ నానిపైనే కోటి ఆశలు పెట్టుకొని ఉన్నారు. నానినే తమను గట్టేక్కిస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ గత కొంతకాలంగా ఫ్లాప్‌లలో ఉన్నాడు. ఆయన కిందటి చిత్రం 'బందిపోటు' డిజాస్టర్‌గా నిలిచింది. ఇక నిన్న మొన్నటివరకు స్టార్ హీరోల ఫేవరేట్ సంగీత దర్శకునిగా నెంబర్‌వన్ స్థానంలో నిలిచిన మణిశర్మ ప్రస్తుతం ఫామ్ కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈయన గతంలో పలు స్టార్స్ చిత్రాలను నిర్మించి ఉన్నాడు. కానీ ఇటీవల వరస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇలా ఇంద్రగంటి అండ్ కో నానిపై కోటి ఆశలు పెట్టుకొని ఉంది. వాస్తవానికి వరుసగా రెండు విజయాల తర్వాత నాని మార్కెట్ రేంజ్ బాగా పెరిగింది. ఆయన సినిమాలకు ఓవర్‌సీస్‌లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇక శాటిలైట్ రైట్స్ కూడా మంచి రేటే పలుకుతున్నాయి. దీంతో నాని తన రెమ్యూనరేషన్‌ను డబుల్ చేశాడని సమాచారం. కానీ ఇంద్రగంటి చిత్రానికి మాత్రం తన పాత రెమ్యూనరేషన్‌ను తీసుకొంటు తన గురుభక్తిని చాటుకున్నాడని తెలుస్తోంది.