కెరీర్ స్టార్ చేసి ఆరేళ్లయింది. కానీ సోలో హీరోగా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు దగ్గుబాటి వారసుడు రానాకు. హీరో కావడానికి గుమ్మడికాయంత బ్యాగ్రౌండ్, పర్సనాలిటీతో పాటు అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ ఆయనకు గోరంత అదృష్టం లేకుండా పోతోందనే బాధ ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. హీరోగా కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, గెస్ట్ పాత్రలతో ఆయన ఇమేజ్ మాత్రం అన్ని భాషల్లోనూ బాగానే ఉంది. కానీ సోలోహీరోగా హిట్ లేకపోవడం ఒక్కటే ఆయనకున్న లోటు. ఆ లోటును కూడా త్వరలోనే తీర్చుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు. ఆయన తాజాగా 'ఘాజీ' అనే చిత్రంలో సోలోహీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో 'బేబి' తర్వాత మరోసారి తాప్సి కీలకపాత్రను పోషిస్తోంది. ఈ చిత్రానికి సంకల్ప్‌రెడ్డి దర్శకుడు కాగా పివిపి సంస్థ నిర్మిస్తోంది.
వాస్తవానికి ఇప్పుడు బాలీవుడ్‌లో యదార్థ గాథలు అద్భుతంగా సక్సెస్ సాధిస్తున్నాయి. 'భాగ్ మిల్కా భాగ్, నీర్జా, మేరీకోవ్'లతో పాటు 'అజర్, ధోనీ' చిత్రాలు కూడా యదార్థగాథలు గానే తెరకెక్కుతున్నాయి. విచిత్రం ఏమిటంటే రానా ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న 'ఘాజీ' కూడా ఓ యదార్థగాథే. 1971లో జరిగిన 'ఇండో-పాక్' వార్‌లో పాకిస్థాన్ ఇండియాపై 'ఘాజీ' అనే జలాంతర్గామిని ప్రయోగించింది. అదే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో రానా ఇండియన్ నావెల్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఏకకాలంలో రూపొందుతోంది. ఈ చిత్రం కోసం ఇటీవల అండర్ వాటర్ డ్రైవింగ్ సీన్స్‌ను ఏకంగా వాటర్ అండర్‌గ్రౌండ్‌లో 20గంటల పాటు చిత్రీకరించారు. ఈ చిత్రం తనకు ఖచ్చితంగా ఓ సోలో హిట్‌ను అందిస్తుందనే నమ్మకంతో దగ్గుబాటి రానా ఉన్నాడు.