ఒకప్పుడు సినిమా తీస్తే దానికి కేవలం థియేటర్లలో వచ్చే వసూళ్లే ఆదాయవనరులు. కానీ ఇప్పుడలా లేదు. శాటిలైట్ రైట్స్, ఇంటర్నెట్‌లో విడుదల చేయడం వంటి అనేక అదనపు ఆదాయవనరులు నిర్మాతలకు వస్తున్నాయి. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఆయనకు 'బాహుబలి'తో అన్ని భాషల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో ఆయన నటించిన పాత చిత్రాలను కూడా ఇప్పుడు ఇతర భాషల్లోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. 'బాహుబలి'తో వచ్చిన క్రేజ్ దృష్ట్యా ఆయా చిత్రాలు కూడా మంచి కలెక్షన్లనే సాధిస్తున్నాయి. ఇప్పటికే 'ఏక్‌నిరంజన్' వంటి చిత్రాలు మలయాళంలోకి డబ్ అయి బాగానే కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇక తాజాగా ప్రభాస్ కెరీర్‌లోనే పెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచిన 'రెబెల్' చిత్రాన్ని హిందీలోకి అనువాదం చేసి యూట్యూబ్‌లో వదిలారు. కాగా ఈ చిత్రానికి కోటి వ్యూస్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి హీరోలకు తప్పితే ఉత్తరాదిలో ఇంత క్రేజ్ ఎవ్వరికీ రాలేదు. ఎన్టీఆర్ నటించిన ఫ్లాప్ చిత్రం 'రామయ్యా..వస్తావయ్యా' చిత్రానికి 60లక్షల వ్యూస్ వచ్చాయి. అదే ఇప్పటివరకు రికార్డు. ఆ రికార్డులను ఓ ఫ్లాప్ చిత్రంతో అధిగమించిన ఘనత ప్రభాస్‌కు బాలీవుడ్‌లో పెరిగిన క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.