సినిమా కోసం మంచు మనోజ్ పడే కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇంతదాకా దక్కలేదనే చెప్పుకోవాలి. ఒళ్ళు హూనం అయ్యేలా పోరాటాలు చేయడం, డూపులను వాడుకోకుండా రిస్కీ స్టంట్స్ పూనుకోవడం మాత్రమే కాదు మనోజ్ అంటే అటు కథ నుండి ఇటు షూటింగ్ స్పాటులో జరిగే ప్రతి విషయం మీద పూర్తి అవగాహన ఏర్పరుచుకుంటూ తనదైన శైలిలో సినిమాను తయారు చేసుకోవడంలో ఇతను దిట్ట. ఇది ఒక రకంగా మనోజ్ కెరీరుకు ప్లస్ అయినా మరెన్నో రకాలుగా మైనస్ అవుతూ వస్తోంది. అందుకే సూపర్ హిట్ అన్న బ్రహ్మ పదార్థానికి కాస్తంత దూరంలో నిలిచిపోయాడు. ఇక మార్చి 4న మన ముందుకు రానున్న కొత్త చిత్రం శౌర్య పైనే మనోజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎమోషన్స్ పండించడంలో నిష్ణాతుడైన దశరథ్ దర్శకత్వంలో రూపొందింది ఈ థ్రిల్లర్ లవ్ స్టోరీ. ఓ సింపుల్ ప్రేమ కథగా మొదలయ్యి, అమోఘమైన థ్రిల్ ఎలిమెంట్ జోడవడంతో సినిమా చాలా కొత్త ఫీలింగ్ ఇవ్వనుంది అన్నది ఇండస్ట్రీ టాక్. రేజీనా హీరోయిన్ అవడం కూడా సినిమాకు ఒకింత మేలు చేకూర్చేదే. పెళ్లి తరువాత మనోజ్ కొత్త జీవితంలో ఈ చిత్రం మరింత ఆనందం నింపాలని కోరుకుందాం.