బాలకృష్ణ వందో సినిమా గురించి తాజాగా మరో సంచలన వార్త బయటికొచ్చింది. మైలురాయిలాంటి తన వందో చిత్రాన్ని తీసే అవకాశాన్ని బాలకృష్ణ సెన్పేషనల్ డైరెక్టర్ కృష్ణవంశీకి అప్పజెప్పాడని సమాచారం. ఇప్పుడు ఫిల్మ్‌నగర్ జనాలు ఆ విషయం గురించే ఆసక్తికరంగా మాట్లాడుకొంటున్నారు. వందో సినిమా అని దాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని... అన్ని సినిమాల్లో అదొకటని బాలకృష్ణ సాదాసీదాగా చెబుతూ వచ్చారు. కానీ ఆయన అభిమానులు మాత్రం ఆ చిత్రం స్పెషల్‌గా ఉండాల్సిందే అని పట్టుబడుతున్నారు. వాళ్ల మాటని కాదనలేక బాలయ్య కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
మొదట తన వందో చిత్రాన్ని సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తారని... అది 'ఆదిత్య 369'కి సీక్వెల్‌గా ఉంటుందని స్వయంగా చెప్పాడు బాలయ్య. కానీ ఆ వెంటనే మనసు మార్చుకొన్నట్టు తెలిసింది. సింగీతంలాంటి సీనియర్ దర్శకుడు ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా తీయడం కష్టమేమో అని, వందో చిత్రానికి యంగ్ డైరెక్టర్ అయితేనే బాగుంటుందని అభిమానులు చెప్పడంతో బాలయ్య ఆగిపోయినట్టు తెలుస్తోంది. దీంతో క్రిష్, అనిల్ రావిపూడిలాంటి యంగ్ డైరెక్టర్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. నిజానికి బాలయ్యతో వందో చిత్రాన్ని చేయాలని బోయపాటి శ్రీను స్క్రిప్టు కూడా సిద్ధం చేసి పెట్టుకొన్నాడు. అయితే ఆయన ప్రస్తుతం 'సరైనోడు' సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. ఆ సినిమా వ్యవహారాల నుంచి బయటికొచ్చేవరకు చాలా సమయం పడుతుంది. అంతవరకు ఎందుకు ఆగడం అన్నట్టుగా బాలకృష్ణ తన వందో సినిమా గురించి వేగంగా నిర్ణయాలు తీసుకొంటున్నాడు. దీంతో తాజాగా కృష్ణవంశీ పేరు బయటికొచ్చింది. ఇటీవలే బాలయ్యని కలిసిన కృష్ణవంశీ ఓ కథ వినిపించాడట. ఆ కథ నచ్చడంతో వందో సినిమాగా చేసేద్దామని స్వయంగా బాలకృష్ణే చెప్పినట్టు తెలిసింది. దిల్‌రాజు నిర్మాణంలో రుద్రాక్ష అనే సినిమా చేసే పనుల్లో కృష్ణవంశీ ఉన్నట్టు ఈమధ్య వార్తలొచ్చాయి. బాలయ్య గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి కృష్ణవంశీ కొన్నాళ్లపాటు రుద్రాక్షని వాయిదా వేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.