కొరటాల శివ దర్శకత్వంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీస్ పతాకంపై రూపొందనున్న 'జనతాగ్యారేజ్' చిత్రం ఇంకా ప్రారంభం కాకముందే ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల రేంజ్‌ను పెంచేశాడు. సినిమా ప్రారంభం కాకముందే కొరటాల రేంజ్‌ను ఎలా ఎన్టీఆర్ పెంచాడా? అనే సందేహం రావచ్చు. ఇక విషయానికి వస్తే స్టార్ హీరోల సినిమాల విషయంలో సాధారణంగా ప్రతి విషయంలో హీరోల ప్రమేయం ఉంటుంది. చివరకు తమ రెమ్యూనరేషన్‌లోనే కాదు.... సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్స్‌ను కూడా స్టార్ హీరోలే శాసిస్తారు. అందుకే దర్శకులు స్టార్ హీరోలను పట్టుకుంటే చాలు రెమ్యూనరేషన్స్, ప్రాజెక్ట్‌లు అవే సెట్ అవుతుంటాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ తన దర్శకులకు నిర్మాతల చేత భారీగా రెమ్యూనరేషన్స్‌ను ఇప్పిస్తాడనే పేరుంది. తాజాగా పట్టాలు ఎక్కబోతున్న 'జనతాగ్యారేజ్' చిత్రం కోసం ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివకు పదికోట్ల రెమ్యూనరేషన్‌ను పట్టుబట్టి నిర్మాతలను అందుకు ఒప్పించాడని సమాచారం. నిర్మాతలు వాస్తవానికి కొరటాలకు 8కోట్లు ఇవ్వాలని భావించారట. కానీ ఎన్టీఆర్ పట్టుబట్టి మరీ పదికోట్లు ఇప్పిస్తున్నాడని తెలుస్తోంది. కొరటాల తన మొదటి చిత్రం 'మిర్చి'కి 50లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత చేసిన మహేష్ 'శ్రీమంతుడు' చిత్రానికి నాలుగు కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఒకేసారి ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ అందడంతో కొరటాల కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాడట. మూడో సినిమాకే ఇలా పదికోట్ల క్లబ్బులోకి ఎంటర్ కావడం సామాన్యమైన విషయం ఏమీ కాదంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు.