కృష్ణ సూపర్ స్టార్, చిరంజీవి మెగా స్టార్, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్... ఇలా టాలివుడ్ మొత్తం స్టార్ హీరోలతో నిండిపోయింది. ఓ హీరో నుండి స్టార్ హీరో అవాలంటే సమయం వచ్చిన ప్రతిసారీ తమ చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటడమే కాకుండా ఆయా హీరోలు తమకంటూ ఓ స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పరుచుకోవాలి. తాజా ఈ స్టార్ ట్యాగులు కూడా కాస్తంత కామెడీ అయిపోయాయి. సంపూర్నేష్ బాబు బర్నింగ్ స్టార్ అనగానే జనాలు పగలబడి నవ్వుకున్నారు. ఆయనకు కాబట్టి అది సరిపోయింది. అదే ఏ మెగా ఫ్యామిలీకో, నందమూరి కుటుంబానికో ఇది తగిలిస్తే తాట తీసేవారు. అటు తరువాత న్యాచురల్ స్టార్ అంటూ నానీకి కూడా బిరుదు వచ్చేసింది. భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాధలతో ఆ బిరుదుకు సరితూగేందుకు నానీ కష్టపడుతున్నాడు. ఇక ఈసారి వంతు కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్. నిన్న రిలీజయిన కృష్ణాష్టమిలో సునీల్ పేరు సరసన గోల్డెన్ స్టార్ అని తోక తగిలించేసారు. అంటే సునీల్ కూడా స్టార్ హీరో అయినట్టే అనే నిర్మాత దిల్ రాజు గారు తెలియజేస్తున్నారు. ఇక నుండి సునీల్ హీరోగా రానున్న అన్ని చిత్రాలలో ఈ గోల్డెన్ స్టార్ టైటిల్ తళతళా మెరిసిపోవాల్సిందే.