కమెడియన్లు హీరోలుగా మారడం, నటీనటులు నిర్మాత, దర్శకుల అవతారం ఎత్తడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ వారిలో విజయవంతం అయిన వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఇక హీరో నాని విషయానికి వస్తే ఆయన 'భలే భలే మగాడివోయ్' చిత్రంలో 35కోట్ల రేంజ్‌కు చేరుకున్నాడు. తాజాగా విడుదలైన 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రం కూడా ఓకే అనిపించుకుంది. ఇలా ఈ హీరోకు ఇప్పుడు బాగా క్రేజ్ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో కేవలం హీరోగానే ఉండి తన దృష్టిని మొత్తం నటనపై కేంద్రీకరించి.. వచ్చిన క్రేజ్‌ను నిలబెట్టుకోవడం మీదనే నాని తన దృష్టిని కేంద్రీకరించడం ముఖ్యం. కానీ గతంలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన అనుభవం ఉండటంతో, నిర్మాతగా కూడా తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నాడట నాని. ఈ దశలో ఓ రిస్క్‌ను ఆయన తన తలపై వేసుకున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన 'పన్నయ్ యారుం పద్మనియం' చిత్రం రీమేక్ రైట్స్‌ను నాని ఏకంగా ఒకటిన్నర కోటి చెల్లించి రీమేక్ రైట్స్ కొనడమే కాదు.... ఈ సినిమాని స్వయంగా నిర్మించాలని భావిస్తున్నాడు. ఇది వరుస విజయాలు అందించిన కాన్ఫిడెన్సా?లేదంటే తనకు వస్తున్న వసూళ్లని చూసి మురిసిపోతూ తన ఇమేజ్‌ను ఎక్కువగా ఊహించుకుంటున్నాడా? లేక ఈ తమిళ చిత్రంలోని కథకు నాని దాసోహమైపోయాడా? అనే సందేహాలు అందరిలో తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి దర్శకుడిని వెతికే పనిలో నాని బిజీగా ఉన్నాడట. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఇంద్రగంటి మోహనకృష్ణ తర్వాత ఈ కొత్త చిత్రం పట్టాలెక్కే చాన్స్ ఉంది....!