టాలివుడ్ నాలుగు మూల స్తంభాలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ అండ్ నాగార్జునలు కొత్తగా వస్తున్న యువ కెరటాలతో పోటీ పడుతూ కూడా తమ విశిష్టతను కాపాడుకుంటున్నారు. కొన్నేళ్లుగా చిరంజీవి గారు మెగాస్టార్ బిరుదును పక్కన పెట్టి మరీ రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తూ గ్లామర్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తరువాత, నందమూరి బాలకృష్ణ చిత్రాలకు గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం విజయాల శాతం తక్కువే అయినా సింహా, లెజెండ్ లాంటి వాటితో తాను కూడా 30, 40 కోట్లు వసూల్ చేయగలనని, వయసుతో సంబంధం లేకుండా వెటరన్ హీరోలలో తానే టాప్ అని నిరూపించుకున్నాడు. ఇక నాగార్జున అయితే ఫర్ ఎవర్ యంగ్ అంటూ సోగ్గాడే చిన్ని నాయనతో 50 కోట్ల దాకా ఎగబాకారు. సరైన కథ, కథనం ఉన్న చిత్రం నాగ్ మీద పడితే బాక్సాఫీస్ ఎంతలా ఊగిపోతుందో చాటి చెప్పిన చిత్రమిది. ఆఖరిగా విక్టరీ వెంకటేష్ గారు మాత్రం 20 నుండి 30 కోట్ల మధ్యలోనే కొట్టుమిట్టాడుతూ కొంత బ్రేక్ తీసుకున్నట్టుగా అగుపించారు. మళ్ళీ ఇప్పుడే బాబు బంగారంతో దిగుతున్నారు. యంగ్ హీరోలు రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తుంటే బాలకృష్ణ, నాగార్జునలు వారికి 30, 40 కోట్ల సినిమాలతో సరైన పోటీనిస్తున్నారు. ఇక చిరంజీవి కత్తి, వెంకీ బాబు బంగారంతో బాక్సాఫీసుని బద్దలు కొడితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న మాట నిజమవుతుంది.