అటు దిల్ రాజు బ్యానరుకు, ఇటు హీరోగా సునీలుకు కొన్నాళ్ళుగా బడా సినిమాలు గానీ బడా బడా హిట్లు గానీ లేవు. అందుకే అల్లు అర్జున్ కోసం అనుకున్న ఓ ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలో మార్పులు చేర్పులు చేసి సునీలును హీరోగా పెట్టేసి ఖర్చుకు వెనకాడకుండా యమా రిచ్చుగా కృష్ణాష్టమిని తీసారు. ఎంత రిచ్చుగా అంటే, హీరో సునీల్ బట్టలకే 20 లక్షల పైన డబ్బులు పోసారంట. మరో నాలుగు రోజుల్లో సినిమా హాళ్ళలో దిగబోతున్న ఈ మూవీ ఎందుకో గాని దిల్ రాజుకు తెగ నచ్చేసినట్లుంది. అందుకే తమ సంస్థకే కాకుండా సునీల్ దశ కూడా తిరగబోతోందని మరి నొక్కి వక్కానిస్తున్నారు. కథాబలమున్న చిత్రాలకే దిల్ రాజు గారు మొగ్గు చూపుతారు కాబట్టి కృష్ణాష్టమితో పాటుగా మరో రెండు కథలు టేబుల్ మీదున్న దీని వైపే మనసు లాగేసిందని చెబుతున్నారు. హీరోగా సునీల్ మార్కెట్ పరిధుల్ని కూడా దాటేసి భారీగా ఖర్చు చేసారంటే కేవలం కథ మీదున్న నమ్మకంతోనే అంట. దర్శకుడిగా వాసు వర్మ తీసిన మొదటి చిత్రం జోష్ పెద్దగా ఆడకపోయినా సెకండ్ చిత్రంతో తానెంతో నిరూపించుకుంటాడని దిల్ రాజు గారు చాలా భరోసాగా మాట్లాడుతున్నారు.