సినిమా రంగంలో భజన అనేది చాలా ముఖ్యం. ముఖస్తుతి చేయనిదే ఏ హీరో, దర్శకుడు, నిర్మాత వంటి వారు ఎవ్వరికీ అవకాశం ఇవ్వరు. అందుకే టాలీవుడ్‌లో టాలెంట్ కన్నా పొగడ్తలకు, భజనకు, వ్యక్తిగత పూజలకు మధ్య విడదీయరాని బంధం ఉంది. కానీ కొందరు దీన్ని భజన అంటే ఒప్పుకోరు. అలా పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడటం తమ బాద్యత అంటారు. ఇలాంటి భజనపరుల్లో తమన్ ఒకడు. టాలెంట్ పిడికెడంత.. భజన కొండంత... అనే టైపు వ్యక్తి తమన్. తాను పనిచేసే సినిమాలను, ఆయా హీరోలను, దర్శకనిర్మాతలను ఆయన మునగచెట్టు ఎక్కిస్తుంటాడు. అందుకే సంగీతంలో విషయం ఉన్నా లేకున్నా ఆయనే కావాలని మన స్టార్ హీరోలు సైతం కోరుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఆయన తాను పనిచేసే స్టార్స్‌ను ఎంతగానో పొగిడి వారి వాయిస్ అదుర్స్ అని పొగుడుతూ, వారిలోని టాలెంట్‌ను వెలికితీస్తున్నానంటూ సెలవిస్తూ ఆయా స్టార్స్ చేత తను చేసే సినిమాల్లో వారి చేత ఒకటి రెండు పాటలు పాడిస్తూ వారికి ఎనలేని గౌరవం ఇస్తుంటారు. ఇప్పటికే రవితేజను 'నౌటంకి..నౌటంకి' పాట ద్వారా సింగర్‌ను చేసిన ఆయన ఆస్థాన సంగీత దర్శకుడయ్యాడు తమన్. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కోసం 'రాకాసి రాకాసి..' పాటను పాడించి అదిరింది అనిపించుకున్నాడు. ఇక ఎన్టీఆర్‌ను ఆయన మరోసారి వాడుకున్నాడు. పునీత్‌రాజ్‌కుమార్ హీరోగా కన్నడలో రూపొందుతున్న 'చక్రవ్యూహ' చిత్రంతో ఎన్టీఆర్, కాజల్‌అగర్వాల్‌ల చేత కన్నడలో పాటలు పాడించి అక్కడ కూడా పునీత్‌కి పుణ్యపురుషుడైనాడు. తాజాగా ఆయన 'సరైనోడు' చిత్రంతో బన్నీ చేత కూడా పాటపాడించి అటు బన్నీ మెప్పును, ఇటు అల్లుఅరవింద్‌కు పుత్రోత్సాహాన్ని అందించి బోయపాటి చేత శభాష్ అనిపించుకొని ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్‌కు ఆరాధ్యదైవంగా మారాడు. మొత్తానికి స్టార్‌హీరోలు తనతో పనిచేస్తే వారికి ఓ పాటను పాడే చాన్స్ ఇస్తూ, వారిలోనే వారికి తెలియకుండా దాగివున్న సింగింగ్ టాలెంట్‌ను బయటకు తీసుకువచ్చి, తన ప్రత్యేకతను చాటుకుంటూ, ఆయా హీరోల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతూ వారి సినిమాలను అందిపుచ్చుకుంటున్నాడు మన తమన్.