తాను మొదలుపెట్టబోయే ప్రతి కొత్త చిత్రానికి ఉచిత ప్రచారం పొందే కార్యక్రమంలో భాగంగా రామ్ గోపాల్ వర్మ గారు ప్రతిసారీ ఏదో ఒక కొత్త ఎత్తుగడతో మన ముందుకొస్తారు. ఈసారి విచిత్రంగా తాను తెలుగులో దర్శకత్వం వహించబోయే ఆఖరి చిత్రం వంగవీటి అంటూ మీడియా ముందు గోలీ వేసారు. ఒకప్పటి శివ నుండి మొన్నొచ్చిన వీరప్పన్ వరకు వర్మలో విభిన్న కోణాలను మనం వీక్షిస్తూనే ఉన్నాం. సినిమా బాగున్న ప్రతిసారీ మా వర్మ గొప్పోడని, బాలేని ప్రతిసారీ ఈయన పతనం మొదలయింది అని కాట్లు, కామెంట్లు వదులుతూనే ఉంటాం. తప్పయినా, ఒప్పయినా వర్మని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం ఎవరి తరమూ కాదు. అందుకేనేమో వంగవీటిని ఆఖరి చిత్రం అని వర్మ చెబుతున్న మాటలను పెద్దగా ఖాతరు చేయడం లేదు జనాలు. కాపు, కమ్మ కులాల మధ్య చిచ్చు పెట్టె మాటలతో ట్విట్టర్ మొత్తం దుమ్ము రేపుతున్న వర్మ, ఇక వంగవీటి రంగ, రాధల కథని తెర మీద ఎలా ఆవిష్కరిస్తాడా అన్నది సస్పెన్స్. విజయవాడతో అపూర్వమైన అనుభవం ఉన్న వర్మకు అక్కడి కుల పిచ్చి గురించి, 80లలో జరిగిన రక్తఖాండ గూర్చి పూర్తి అవగాహన ఉంది. గాయం అన్న జగపతి బాబు సినిమాకు కూడా మూలం అక్కడే ఉంది. వర్మ తదుపరి చిత్రం తెలుగులో తీస్తాడా తీయడా అన్నది ఇక్కడ సందర్భం కాకపోయినా ఆ ఒక్క మాటతో వంగవీటిని మరింత పాపులర్ చేసే ప్రక్రియలో కొత్త ట్రిక్ మాత్రం ప్లే చేసేసాడు.