సౌత్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుల్లో తమిళ దర్శకుడు బాల ఒకరు. అతని సినిమాలు రియలిస్టిక్‌గా ఉంటాయి. కాబట్టే పలు జాతీయ అవార్డులు ఆయన సొంతం చేసుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండటమే కాదు... హీరోల లుక్ డిఫరెంట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటమే దీనికి కారణం. సౌత్‌లో స్టార్‌హీరోలు సైతం ఆయనతో ఒక్కసారైనా పనిచేయాలని ఆశపడుతుంటారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాల దర్శకత్వంలో తెలుగుహీరో రానా ఓ సినిమా చేయబోతున్నాడు. 'బాహుబలి' ముందు వరకు రానా అంటే ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ 'బాహుబలి' తర్వాత రానా బాగా పాపులర్ అయ్యాడు. దీనికి తోడు తమిళంలో ఇటీవల రానా నటించిన 'బెంగుళూరు నాట్కల్' చిత్రం మంచి విజయం సాధించింది. మలయాళ హిట్ మూవీ 'బెంగుళూరు డేస్'కు రీమేక్ ఇది. ఈ సినిమా హిట్‌తో బాల కన్ను రానా మీద పడింది. ఇటీవల రానాకు ఓ స్టోరీ కూడా వినిపించాడు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని ఓకేసారి తమిళంతో పాటు తెలుగులో కూడా రూపొందించడానికి బాల సమాయత్తం అవుతున్నాడు. స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటనలతో ఈ సినిమా ఉంటుందని, వివాదాస్పద నవల కుట్రా పరంబరై అనే నవల ఆధారంగా ఈ చిత్రం ఉంటుంది అంటున్నారు. మరి రానాను బాల ఏ రేంజ్‌లో చూపెడతాడో వేచిచూడాల్సివుంది. బాలాతో పాటు 'పరుత్తివీరన్'తో జాతీయ అవార్డులను కొల్లగొట్టిన మరో దర్శకుడు అమీర్ కూడా రానాతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. వీటితో పాటు రాజమౌళి 'బాహుబలి2', శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో 'లీడర్' చిత్రానికి సీక్వెల్, మరో వైపు 'ఘాజీ' చిత్రాలతో రానా నెమ్మదిగానే అయినా సౌత్‌స్టార్‌గా ఎదుగుతున్న మాట వాస్తవం...!