ఇప్పటివరకు ఏ సంక్రాంతికీ లేని పోటీ 2016 సంక్రాంతికి ఏర్పడింది. మూడు రోజుల గ్యాప్‌లో నలుగురు హీరోల సినిమాలు రిలీజ్ అయి దేనికదే తమ స్థాయికి తగ్గట్టుగా విజయాల్ని అందుకున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి సినిమాల కలెక్షన్ల రికార్డులను చూస్తే రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్కటి మాత్రమే సూపర్‌హిట్ అయి మిగతా సినిమాలు డిజాస్టర్స్‌గా టాక్ తెచ్చుకున్నాయి. కానీ, ఈ సంక్రాంతికి మాత్రం ఏ సినిమానీ డిజాస్టర్ అని చెప్పలేని విధంగా సేఫ్ అయిపోయాయి. ఒకవిధంగా ఈ సంక్రాంతి పోటీ అందరికీ సంతోషాన్నే మిగిల్చిందని చెప్పాలి.
ఇక సంక్రాంతి తర్వాత సమ్మర్ సినిమాల సందడి స్టార్ట్ కాబోతోంది. తమ సినిమాల రిలీజ్ డేట్స్‌ని ఇప్పటి నుంచే ఎనౌన్స్ చేస్తూ ఈ సమ్మర్‌ని మరింత వేడెక్కించడానికి హీరోలు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఇద్దరు మెగా హీరోల మధ్య పోటీ వుండబోతోందని తెలుస్తోంది. పవన్‌కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్దార్ గబ్బర్‌సింగ్‌ని ఏప్రిల్ 8న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ జరుగుతుండగా, మరో పక్క అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ సరైనోడు చిత్రాన్ని కూడా కాస్త అటూ ఇటూగా సర్దార్‌కి పోటీగా దింపాలని ట్రై చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాతే అల్లు అర్జున్ సినిమాని కూడా దాదాపు అదే డేట్‌కి రిలీజ్ చెయ్యాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో డైలమాలో పడిన పవన్‌కళ్యాణ్‌కి మెగాస్టార్ చిరంజీవి మద్దతు కూడా తోడైందని తెలుస్తోంది. తమ్ముడి సినిమాకి పోటీగా వస్తున్న అల్లు అర్జున్‌కి తగిన గుణపాఠం చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైమ్‌కే సర్దార్‌ని బయటికి తీసుకు రావాలని తమ్ముడికి మెగాస్టార్ గట్టిగా చెప్పి వచ్చినట్టు తెలుస్తోంది. ఈమధ్య అనుకోకుండా సర్దార్.. సెట్స్‌కి చిరంజీవి వెళ్ళి రావడంతో ఇది నిజమే అనిపిస్తోందని ఫిల్మ్ నగర్‌లో చెప్పుకుంటున్నారు. అన్నయ్య మద్దతుతో వస్తున్న పవన్‌కళ్యాణ్, దర్శకనిర్మాతల వత్తిడి వల్ల వస్తున్న అల్లు అర్జున్... ఈ ఇద్దరు మెగా హీరోలు పోటీకి సిద్ధమవుతారా? లేక తమ రిలీజ్ డేట్స్ విషయంలో మరోసారి ఆలోచిస్తారా? అనేది తెలియాల్సి వుంది.