విశ్వనటుడు కమల్‌హాసన్ తన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం 2' రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా విడుదల కావడం లేదు. ఈ ఏడాది కూడా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదని చెన్నై సినిమా వర్గాల సమాచారం. అయితే ఇలా విడుదల ఆలస్యం కావడానికి కారణం నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ అని తేల్చిచెప్పిన కమల్ తాను కూడా ఈ చిత్రంపై ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. కమల్ పట్టుబట్టి ఉంటే ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ అయివుండేదని అంటున్నారు. అయితే కమల్ కూడా ఈ చిత్రం విషయంలో ఎందుకో తాత్సారం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఇప్పుడు బయటకు లేవాలంటే కనీసం 25కోట్లు కావాలి. వడ్డీలు బాగా పెరిగిపోయాయి. అందుకే ఈ సినిమాని కమల్‌హాసన్ వదిలేశాడని అంటున్నారు. 'విశ్వరూపం' వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. ఇప్పుడు ఆ సినిమాపై ఎవ్వరికీ క్రేజ్ లేదు. కాబట్టి రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో తెలియదు. అలాగే ఈ చిత్రం క్లైమాక్స్ సన్నివేశాలు అనుకున్న విధంగా రాలేదట. దాంతో కమల్‌హాసన్ కూడా అసంతృప్తిగా ఉన్నాడు. ఈ సన్నివేశాలను రీషూట్ చేయాలని ఆయన అనుకుంటున్నానరట. ఇవన్నీ ఇప్పుడు జరిగే పనులు కావని కోలీవుడ్ వర్గాల సమాచారం.