కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్‌కు కూడా సుపరచితుడు హీరో సిద్దార్ద్. ఆయన గత కొంతకాలంగా కోలీవుడ్‌లో కొత్త దర్శకులతో విభిన్నమైన వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ ఉన్నాడు. కొన్నింటికి తానే నిర్మిస్తున్నాడు. సాధారణంగా మూసకథలు చేసే హీరోలు చెప్పేమాట ఏమిటంటే.. కొత్త తరహా కథలు తమ వద్దకు రావడం లేదంటూ తప్పును రచయితల మీదకు నెట్టేస్తుంటారు. కానీ వీరిలా గాక నూతన కథల కోసం సిద్దు ఏకంగా ఓ ప్రయోగం చేస్తున్నాడు. రైటర్స్ ల్యాబ్ అనే సంస్థను స్ధాపించాడు. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే... ఎవరైనా సరే తమ దగ్గర ఉన్న విభిన్నకథలను ఇక్కడకు పంపవచ్చు. కథ పాయింట్ నచ్చితే ఈ సంస్థలో పనిచేసే రచయితలే ఈ కథలకు పక్కా స్క్రిప్ట్‌ను తయారుచేస్తారు. అలాంటి చిత్రాలను సిద్దార్ద్ తానే హీరోగా లేక ఇతర హీరోలతో గానీ తెరకెక్కిస్తాడు. ఇలా అప్‌కమింగ్ రైటర్స్‌కు సిద్దు బంపర్‌ఆఫర్ ఇస్తున్నాడు. ఈ తరహా ప్రయోగాన్ని మన తెలుగు హీరోల్లో కూడా ఎవరో ఒకరు చేస్తే మరిన్ని వైవిధ్యమైన కథలు వచ్చే అవకాశం ఉందని సినీ విమర్శకులు సిద్దు ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.