చిరంజీవి 150వ సినిమా ముహూర్తం కాదు దుర్ముహూర్తంతో అఘోరిస్తోంది. ఏ క్షణాన కథల కోసం వేట మొదలు పెట్టారో కానీ అడుగడగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. మన తెలుగు కథా రచయితలకు మెగా స్టార్ ఇమేజిని అర్థం చేసుకొని కథలు రాసే సత్తా లేదని తేల్చిపడేసి తమిళ దర్శకుడు మురుగదాస్ చేసిన కత్తి సినిమాను రీమేక్ చేయడానికి సిద్దమవడం విదితమే. ఇక్కడా ఒడిదొడుకులే. కత్తి కథ నాదంటూ రచయిత నరసింహారావు గారు రచయితల సంఘం, దర్శకుల సంఘంలో పేచి పెట్టుకు కూర్చున్నారు. దాసరి గారు సీన్లోకి దిగి వివాదం సాంతం పరిష్కారమయ్యే వరకు చిరంజీవి కత్తికి ఎవరూ సహకారం అందించవద్దని అల్టిమేటం జారీ చేసారు. వీటన్నింటికీ తోడు నిన్న దర్శక, రచయితల సంఘం ప్రెస్ మీటులో పరుచూరి వెంకటేశ్వరా రావు గారు, వీర శంకర్ గారు కూడా నరసింహారావుకు న్యాయం చేయాలని నొక్కి వక్కాణించారు. కత్తికి కావాల్సిన తెలుగు కథా కథనాలు సమకూర్చుకోవడం పక్కన పెట్టేసి, సంగతి మొత్తం తేలేదాకా, నరసింహరావు సమస్య కొలిక్కి వచ్చేదాకా ఎటువంటి ప్రకటన గానీ అఫీషియల్ సమాచారం గానీ బయటకు పొక్కకుండా ఉండేందుకు చిరంజీవి గారు ప్రాజెక్టు బరువు మొత్తం రామ్ చరణ్ నెత్తి మీదే పెట్టేసారు. నిర్మాతగా మారి తండ్రి సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాలు చూడాలనుకుంటే ఈ కొత్త తలనొప్పి ఏంట్రా బాబూ అనుకుంటున్నాడెమో పాపం రామ్ చరణ్!