ఏదో సినిమాలో కోట శ్రీనివాస రావు పాత్రని మీడియా తరఫున ఏ ప్రశ్న అడిగినా, గదయితే మేం ఖండిస్తున్నం అని సమాధానం ఇచ్చినట్టుగా కేరళ నుండి పనిగట్టుకొని వచ్చిన పవన్ కళ్యాణ్ నిన్న తునిలోని కాపు ఐక్య గర్జనలో జరిగిన విధ్వంసం గూర్చి ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన సమాధానాలు అచ్చు కోటగారి సినిమాలో లాగానే ఉన్నాయి. పవర్ స్టార్ స్పందన అంటే ప్రమాణాలు చేసి విఫలమవుతున్న చంద్రబాబు నాయుడును ఎండ గట్టడమో లేక కులం ప్రాతిపదికన వాళ్లకు రావాల్సిన రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న వారికి చేయుతగానో ఉంటుందని ఊహించుకున్న ఇరు వర్గాలకి పవన్ పెట్టిన నేటి ప్రెస్ మీట్ ఎందుకబ్బా అని ఒకరి మొహాలు ఇంకొకరు చూసుకునేలా ఉంది. జరిగిన విషయం మీద కనీస పరిజ్ఞ్యానం లేనివాడిలా, హీన పక్షాన దినపత్రిక కూడా చూడనోడు మాట్లాడినట్లుగా ఉంది పవర్ స్టార్ తంతు. ఈ మాత్రం దానికే కేరళ నుండి లగెత్తుకు వచ్చేయాలా అన్న రియాక్షన్ అటు మీడియా వారి నుండీ ఇటు సామాన్య జీవుని నుండీ వినబడింది. ఈ చోద్యానికి తోడు సినిమా డైలాగులను తలపించేలా, నేను దేశ ఐక్యతను కోరుకుంటాను కానీ ఏదో ఒక్క కుల డిమాండును సమర్థించను అని గందరగోళంలో తత్తరపాటును ప్రదర్శించారు. తుని లాంటి ఉదంతాల వల్ల అందరి మనసులు బాధ పడుతాయి. ఆ మాత్రం దానికి మాకు ఓ ప్రెస్ నోట్ పంపిస్తే సరిపోతుంది కదా. కేరళ నుండీ వచ్చేస్తున్నా అంటే, మీరు ఏదో చెబుతారని, సమస్యకు మీదైన శైలిలో పరిష్కారం చూపుతారని జనాలు ఊహించేసుకోరు. మీకు అటు తుని సంఘటన మీద గానీ, ఇటు జనాలు మీ మీద పెట్టుకున్న అంచనాల మీద గానీ... ఎక్కడా గ్రౌండ్ రియాలిటీ అర్థం అవటం లేదు పవర్ స్టారు! ఉంటె పూర్తిగా అటుండు, లేదా మొత్తం ఇటుండు... మధ్యలో ఉంటా అంటే ఎట్లా సారూ?