మితిమీరిన బడ్జెట్ ఎంతటి చేటు చేస్తుందో అడపాదడపా కాస్ట్ ఫెయిల్యూరుగా వచ్చే కొన్ని చిత్రాలు లెసన్స్ నేర్పుతూనే ఉంటాయి. తాజాగా జూనియర్ ఎన్టీయార్ నాన్నకు ప్రేమతోని అదే కోవలోకి వేసారు ట్రేడ్ విశ్లేషకులు. నలభయ్యో, యాభయ్యో కోట్లు, సరిగ్గా తెలీదు గానీ ఎంతైనా ఎన్టీయార్ స్టామినాను మించిన ఆదాయ, వ్యయ పట్టికను అనుసరించి భారీ రిస్క్ మీద నాన్నకు ప్రేమతో చిత్రాన్ని నిర్మించి విడుదల చేసారు భోగవల్లి ప్రసాద్ గారు. ఒక్క ఓవర్సీస్ మినహాయించి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఉన్న బయ్యర్లు అందరూ ముక్కుతూ మూలుగుతూ తాము పెట్టిన పెట్టుబడిని రాబట్టుకునే పోరాటం చేస్తున్నారు. సంక్రాంతి సినిమాలలో భారీ వసూళ్లు రాబట్టిన బెస్ట్ మూవీగా లెక్కేసినా, యాభై కోట్ల క్లబ్బులోకి తారక్ ఎంట్రీ ఇచ్చినా, నాన్నకు ప్రేమతో లాభాల వ్యవహారంలో మాత్రం సోగ్గాడే చిన్ని నాయన, ఎక్స్ ప్రెస్ రాజా కన్నా వెనకబడే ఉంది అన్నది వాస్తవం. పండగ దాటి మూడు వారాలు గడుస్తోంది కాబట్టి ఈ వారాంతం తరువాత మొత్తం లెక్క పెట్టుకునే డబ్బులే ఈ చిత్రం ఓవరాల్ బిజినెస్ కింద క్లోజ్ చేసుకోవచ్చు. అంటే నాన్నకు ప్రేమతో కథ నాలుగు వారాలకు ముగుస్తుంది!