ఇతరభాషల్లో బాగా హిట్టయిన సినిమాలను రీమేక్ చేస్తే చాలా సౌలభ్యాలు ఉంటాయని, కనీసం మినిమం గ్యారంటీ ఉంటుందనేది చాలామంది హీరోల, దర్శకనిర్మాతల అభిప్రాయం. ఆమధ్య కొన్ని రీమేక్‌లు దారుణంగా ఫెయిల్ కావడంతో వాటి జోరు తగ్గింది. తాజాగా మరలా ఆ జోరు మొదలైంది. సాక్షత్తు మెగాస్టార్ చిరంజీవి కూడా 'కత్తి' రీమేక్‌లో నటించనున్నాడు. ఇక ఆయన కుమారుడు రామ్‌చరణ్ తమిళ హిట్ మూవీ 'తని ఒరువన్' రీమేక్‌లో నటిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్‌లో జాన్ అబ్రహం హీరోగా వచ్చిన 'రాకీ హ్యాండ్సమ్' పై కూడా చరణ్ కన్నేసి ఉన్నాడని సమాచారం. ఇక నాగార్జున విషయానికి వస్తే ఆయన కార్తితో కలిసి నటిస్తున్న 'ఊపిరి' చిత్రం కూడా 'ది ఇన్‌టచ్‌బుల్స్' అనే ఫ్రెంచ్ చిత్రానికి రీమేకే. ఇక నాగ్ తనయులైన నాగచైతన్య, అఖిల్‌లు కూడా రెండు రీమేక్‌లపై కన్నేసి ఉన్నారు. నాగచైతన్య ఆల్‌రెడీ మలయాళంలో హిట్టయిన 'ప్రేమమ్' రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి 'మజ్ను' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక తన తొలిసినిమా 'అఖిల్'తో డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసిన అఖిల్ కూడా తన రెండో చిత్రంగా 'యే జవాని.. హై దివానీ' చిత్రం రీమేక్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. యువహీరో సందీప్‌కిషన్ తమిళ, మలయాళ భాషల్లో మంచి విజయం సాధించిన 'నేరమ్' రీమేక్‌లో నటిస్తున్నాడు. ఇక బెల్లకొండ శ్రీనివాస్ భీమనేని శ్రీనివాసరావుతో కలిసి చేస్తున్న 'స్పీడున్నోడు' కూడా తమిళ 'సుందరపాండ్యన్'కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. నారా రోహిత్ హీరోగా కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో చేస్తున్న 'తుంటరి' చిత్రం కూడా 'మాన్ కరాటే' అనే తమిళ చిత్రానికి రీమేక్. ఇక రానా కూడా మలయాళంలో సూపర్‌హిట్టు అయిన 'బెంగుళూర్ డేస్' అనే రీమేక్‌లో నటిస్తున్నాడు. హీరో సుమంత్ విషయానికి వస్తే ఆయన బాలీవుడ్ హిట్ మూవీ 'విక్కిడోనర్' చిత్రంలో నటించనున్నాడు. అల్లరి నరేష్ విషయానికి వస్తే ఆయన ఈశ్వర్‌రెడ్డితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కన్నడలో మంచి హిట్టయిన 'విక్టరీ' చిత్రానికి రీమేక్. ఇక మరో మెగాహీరో సాయిధరమ్‌తేజ్ కూడా కన్నడలో హిట్టయిన 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి' చిత్రం రీమేక్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఇలా చిరంజీవి నుండి సాయిధరమ్‌తేజ్ వరకు, నాగార్జున నుండి సుమంత్ వరకు అందరూ రీమేక్‌లపై దృష్టిపెట్టాడు. కాగా ఎక్కువగా రీమేక్ చిత్రాల్లో నటించే విక్టరీ వెంకటేష్ కూడా ముందు జాగ్రత్తగా రెండు మూడు పరభాషా చిత్రాల రీమేక్ రైట్స్‌ని పొందాడని తెలుస్తోంది.