ఓటమి ఎరుగని టాలివుడ్ దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించడం అందరు తెలుగు వారు హర్షించదగ్గదే అయినా ఇంత తొందరగా కాకుండా ఇంకా కనీసం అయిదారేళ్ళు ఆగి ఇచ్చి ఉండాల్సింది అన్న వాదన ఎక్కువగా వినబడింది. దర్శకదీరుడిగా రాజమౌళి తాకిన శిఖరాలు గొప్పవే అయినా అతను తీసినవి కేవలం పట్టుమని పది లేదా పదకొండు చిత్రాలే. అందునా అన్నీ ఫక్తు కమర్షియల్ చిత్రాలే. నిజమే తెలుగు సినిమా వాణిజ్య స్థాయిని తద్వారా భారతదేశ చలనచిత్ర టెక్నికల్ స్థాయిని పెంచినవాడిగా జక్కన్న గొప్పోడే. కానీ ఈ మాత్రం దానికే పద్మశ్రీ ఇచ్చి సత్కరించేయాలా అన్నది మరో తర్కవాదం. మరోవైపు అసలు దక్షినాది సినిమా చేత కమర్షియల్ అన్న పదానికి అక్షరాభ్యాసం చేయించిన రాజమౌళి గురువు రాఘవేంద్రరావు గారికి గానీ, అదే జనరేషనుకి చెందిన మరికొంత మంది గొప్ప దర్శకులకి గానీ ఇంతటి గౌరవం దక్కలేదు. అందుకే కాబోలు మీడియాలోనే కాకుండా జనాల్లో కూడా జక్కన్నకొచ్చిన అవార్డు పట్ల పెద్ద రియాక్షన్ కనపడడం లేదు. ఇక పద్మ అవార్డుల విషయంలో మన దేశంలో జరిగే రాజకీయాల గురించి మరోసారి విప్పి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఏదేమైనా పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లుగా బాహుబలికీ విమర్శలు తప్పలేదు, ఇప్పుడు అనుకోకుండా వచ్చిన పద్మ శ్రీ వల్లా కూడా రాజమౌళికి విమర్శకుల గోల తప్పేట్టులేదు.