టాలీవుడ్‌ను ఎంతో కాలం ఏలిన సీనియర్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్. కాగా చిరు రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన స్టామినా ఏమిటనేది ఇప్పుడే చెప్పలేం. ఆయన నటించే 150వ చిత్రం విడుదలైతేనే ఆయన స్టామినాపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలిన ముగ్గురు సీనియర్ స్టార్స్ అయిన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల పని అయిపోయిందని, ఇక వారు హీరోలుగా చేయడం పక్కనపెట్టి తమ వయసుకు తగ్గ పాత్రలు, మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడమే మేలని విమర్శకులు విమర్శలు ఎక్కుపెట్టారు. యంగ్ స్టార్స్ అయిన పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లుఅర్జున్, రామ్‌చరణ్ వంటి యంగ్ స్టార్స్ దాటికి సీనియర్స్ తట్టుకోలేరని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను వెత్తుకోవల్సిందే అని విమర్శలు, విశ్లేషణలు ఎక్కువగా వచ్చాయి. కానీ బాలకృష్ణ 'సింహా, లెజెండ్, డిక్టేటర్' చిత్రాలతో భారీగా కలెక్షన్లు సాధించి తన సత్తా చాటుతున్నాడు. ఇక నాగార్జున విషయానికి వస్తే ఇక ఆయన కూడా సోలోహీరోగా పనికిరాడని, 'ఊపిరి' వంటి సినిమాలకే పరిమితం కావాలన్నారు. కాగా ఆ లెక్క తప్పు అని ఆయన తాజా చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం నిరూపించింది. ఇక వెంకటేష్ మల్టీస్టారర్స్‌కే పరిమితమయ్యాడని అదే ఆయనకు మంచిదని కామెంట్లు వచ్చాయి. కానీ 'దృశ్యం' చిత్రంతో ఆయన ఈ వాదన తప్పు అని తనకు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉందని నిరూపించాడు. తాజాగా మారుతి దర్శకత్వంలో వెంకీ నటిస్తున్న చిత్రంపై కూడా ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. మొత్తానికి విశ్లేషకులు, విమర్శకుల సెటైర్లకు ఈ సీనియర్ స్టార్స్ చెక్ చెప్పినట్లే అని క్లియర్‌గా అర్థం అవుతోంది.