కుటుంబ అనుబంధాలతో సినిమా తీయడమే కాదు... తన కుటుంబం వెనక విశేషాల్ని కూడా బయటపెడుతున్నాడు దర్శకుడు సుకుమార్. ఇటీవలే ఆయన ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో తీశాడు. తన తండ్రిపై ఉన్న ప్రేమనంతా ఆ సినిమాలో చూపించాడు. అంతే కాదు... ఆ సినిమా ప్రచారంలో భాగంగా మీడియా ముందుకొస్తూ కూడా తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి చెబుతున్నాడు. అవన్నీ హృదయాన్ని హత్తుకొనేలా ఉన్నాయి. ఇటీవల ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ నాన్నే ఇప్పుడు ఉండుంటే అంటూ మనసుల్ని కరిగించేలా తన భావోద్వేగాల్ని బయటపెట్టాడు సుకుమార్. మరో పత్రికకి తన ప్రేమ, పెళ్లి, భార్య గురించి చెప్పుకొచ్చాడు. ఆర్య తర్వాత హంసిని అనే అమ్మాయి ప్రేమలో పడ్డానని, ఆ అమ్మాయే తన భార్య అయిందని చెప్పుకొచ్చాడు సుకుమార్.
ఆ విషయాల్ని ఇలా చెప్పుకొచ్చాడు 'ఆర్య సినిమాని చూసేందుకని ఓ థియేటర్లోకి వెళ్లాను. అక్కడ ఓ అమ్మాయి వచ్చి నా ఆటోగ్రాఫ్ అడిగింది. నా ఫోన్ నెంబరు కూడా రాసిచ్చాను అందులో. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. అప్పుడు తను నన్ను అడిగిన ఓ ప్రశ్న అడిగింది. సినిమాకి సంబంధించిన పనులన్నీ టెక్నీషియన్లు చేస్తున్నప్పుడు ఇక దర్శకుడు చేసే పనేంటి?` అని అడిగింది. ఆ ప్రశ్న నన్ను బాధకి గురిచేసింది. దర్శకుడి పనిలో ఎంత కష్టముంటుందో ఆ తర్వాత నేను వివరంగా చెప్పాల్సొచ్చింది. తనని నాకు ఇచ్చి పెళ్లి చేయడం వాళ్ల తల్లిదండ్రులకి ఇష్టం లేదు. సినిమా పరిశ్రమపై ఉన్న భయంతోనే వాళ్లు నిరాకరించారు. మా పెళ్లయ్యాక కొన్నాళ్లకు వాళ్లు సర్దుకున్నారు.. అని చెప్పుకొచ్చాడు సుకుమార్. స్వతహాగా లెక్చరర్ అయిన సుకుమార్ ఇప్పటికీ తనదగ్గర చదువుకొన్న విద్యార్థులతో టచ్‌లో ఉంటానని, వాళ్లలో చాలామంది ఐఏఎస్, ఐపీఎస్‌లు ఉన్నారని చెప్పుకొచ్చాడు.