2013లో విక్రమ్ ప్రభు హీరోగా ఎం.శరవణన్ దర్శకత్వంలో రూపొందిన ఇవన్ వేరమాతిరి అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన సురభి తెలుగులో కన్మణి దర్శకత్వంలో వచ్చిన బీరువా చిత్రంతో పరిచయమైంది. ఆమెకు రెండో అవకాశం ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రంలో మేర్లపాక గాంధీ ఇచ్చాడు. ప్రస్తుతం రామ్‌గోపాల్‌వర్మ ఎటాక్ చిత్రంలోనూ, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది సురభి. చూడటానికి చిన్నపిల్లలా కనిపించే ఈ అమ్మాయికి ఎక్కువగా ఇన్నోసెంట్‌గా వుండే క్యారెక్టర్సే వస్తున్నాయట. ఆమధ్య ధనుష్ హీరోగా వచ్చిన రఘువరన్ బి.టెక్‌తోపాటు తమిళ్ వచ్చిన సినిమాల్లో కూడా ఆమెకు చాలా సైలెంట్ క్యారెక్టర్స్ వచ్చాయట. ఇప్పటివరకు తెలుగు, తమిళ్ కలిపి 5 సినిమాల్లో నటించిన సురభి ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లోనూ, ఒక తమిళ్ సినిమాలోనూ నటిస్తోంది. ఇవి కాక ఇంకా కమిట్ అవ్వాల్సిన సినిమాలు వున్నాయి.
తనకు వస్తున్న క్యారెక్టర్ల పట్ల అసంతృప్తిగా వున్న సురభికి ఒక గోల్ వుందట. అదేమిటంటే రఫ్ అండ్ టఫ్‌గా వుండే యాక్షన్ మూవీస్ చెయ్యాలని. అలాగే అనుష్క చేసిన రుద్రమదేవిలాంటి క్యారెక్టర్స్ అంటే తనకిష్టమని, ఝాన్సీరాణిగా నటించాలన్నది తన గోల్ అని అంటోన్న సురభికి ధైర్యం చేసి అలాంటి క్యారెక్టర్స్ ఆఫర్ చేసే దర్శకనిర్మాతలు దొరకాలంటే కష్టమే కదా. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది డైరెక్టర్లు పిట్ట కొంచెమే కానీ గోల్ మాత్రం ఘనంగా వుందని నవ్వుకుంటున్నారట. మరి ఈ పాప గోల్ ఎప్పటికి నెరవేరుతుందో! ఎప్పుడు కత్తి చేత పడుతుందో మరి.