దశాబ్దాలు, శతాబ్దాలు దాటి మూఢనమ్మకాలను క్రమంగా విడనాడి 21వ శతాబ్దంలో కేవలం సైన్స్ ఆధారంగా ప్రతిదానికీ లాజికల్ రీజనింగ్ ఇస్తూ వస్తున్న తరుణంలో మళ్ళీ మేం పురాతన రాతి యుగానికే వెళ్ళిపోతాం అనేట్టుగా ఉన్న జూనియర్ ఎన్టీయార్ ఫ్యాన్స్ సంస్కృతి సర్వత్రా చర్చనీయాంశం అంశం అయింది. నాన్నకు ప్రేమతో చిత్ర విజయాన్ని ఆకాంక్షిస్తూ తారక్ ఫ్యాన్స్ కొందరు కడప, పులివెందులలో జంతు బలి కార్యక్రమం నిర్వహించారు. ఓ ధియేటర్ ఆవరణలో గొర్రె పిల్లను కసాయిగా నరికి, దాని రక్తంతో ఎన్టీయార్ పోస్టర్ల మీద తీర్థం చల్లారు. అభిమానాన్ని ప్రదర్శించేందుకు ఎన్నో రకాల మార్గాలు ఉండగా ఏ అన్నదానమో, రక్తదానమో చేయకుండా ఈ రక్తదాహం ఏంటయ్యా అని మిగతా హీరోల ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇంతటి జుగుప్సాకర సీన్ మొత్తాన్ని అంతర్జాలంలో పెట్టిన వీడియోలో చూస్తుంటే ఎవరికైనా ఒళ్ళు జలదరించకమానదు. ఈ తతంగం మొత్తానికి తారక్ ఏమంటారో తెలీదు గానీ జంతు బలిని నిషేదిస్తూ ప్రభాస్ బాహుబలిలో చేసిన ఓ ఎపిసోడ్ మొత్తాన్ని ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ సర్క్యులేట్ చేస్తున్నారు.