సంక్రాంతికి విడుదలయిన నాలుగు సినిమాల్లో రెండు నందమూరి వారివే కావడం ఓ విశేషం అయితే, ఆ రెండూ కూడా బాక్సాఫీస్ తుప్పు వదలగొడుతుండడం ఇంకో విశేషం. బాలకృష్ణ గారికి అచ్చొచ్చిన మాస్ సెంటర్లలో డిక్టేటర్ చిత్రం వీరవిహారం చేస్తోంది. ఫ్యాన్సుకు కావాల్సిన అన్ని కమర్షియల్ హంగులు ఇందులో ఉండడంతో ఈజీగా డిక్టేటర్ అన్ని వ్యాపారాలు కలుపుకొని 40 కోట్ల క్లబ్బులో చేరనుందని ఓ అంచనా. ఇక బుడ్డోడు జూనియర్ ఎన్టీయార్ అసలు సత్తాని చాటుతున్న నాన్నకు ప్రేమతో అందరి అంచనాలను దాటుకొని 60 కోట్ల చేరువకు రావడం కూడా కష్టం కాకపోవచ్చు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. నిజానికి నందమూరి అభిమానుల్లో చీలిక ఏర్పడడంతో రెండు సినిమాల పట్లా కొంత నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. అలా అన్నింటినీ తట్టుకోగలిగారు కాబట్టే ఈ రకమైన ఫలితం దొరికింది. నందమూరి హీరోల మధ్య వైరాలు తొలిగి ఫ్యాన్స్ అంతా ఒకే జట్టుగా ఉండి ఉంటె చెరో 10 కోట్లు ఎకస్ట్రా వసూళ్లు నమోదయ్యేవే. ఇప్పటికైనా పైన పొందుపరిచిన నంబర్లు తక్కువేమీ కాదు. లెక్కలన్నీ ముగిసాక బయ్యర్లు ఏమంటారో వేచి చూడాలి.