ఒకప్పుడు తెలుగు తెరపై రొమాంటిక్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా, ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడి పాత్రల్లో ఓ వెలుగు వెలిగిన జగపతిబాబు ప్రస్తుతం హీరో పాత్రలు మానేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్ పాత్రల్లో తన సత్తా చాటుతున్నాడు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... జగపతిబాబు త్వరలో నిర్మాతగా కూడా మారనున్నాడు. వచ్చే నెలలో తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయమై అఫీషియల్ ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. జగపతిబాబు తండ్రి వి.బి.రాజేంద్రప్రసాద్ ప్రముఖ నిర్మాత. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బేనర్‌లో తెలుగులో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. అయితే క్రమక్రమంగా వీళ్ల ఫ్యామిలీ ఆర్ధికకష్టాల్లో పడింది. ఈ క్రమంలో వారు జూబ్లీహిల్స్‌లోని తమ ఇంటిని కూడా అమ్ముకున్నారు. తండ్రి నిర్మాతగా ఉన్నప్పుడే జగపతిబాబు నటునిగా నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం జగపతిబాబు ఆర్ధికంగా నిలదొక్కుకోవడంతో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నిర్మాతగా మారేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే తండ్రి సినిమాలు చేసిన బేనర్‌ను మరలా రీలాంచ్ చేసే ఆలోచన ఆయనకు లేదని, కొత్త బేనర్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడని, 'క్లిక్ సినీ కార్ట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో సంస్థను స్థాపించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.