ఓ సినిమా హిట్టనో, ఫట్టనో తేల్చడానికి నిర్మాతలు, పంపిణీదారులు లేదా బయ్యర్లు పొందే లాభాలే ప్రామాణికం అయితే ఈ సంక్రాంతికి నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన గెలుపొందడానికి అవకాశాలు మెండు అంటున్నాయి వ్యాపార వర్గాలు. కాస్తంత ఆలస్యం అయినా హీరో అండ్ నిర్మాతగా నాగార్జునగారు తీసుకున్న ఈ సినిమా రిలీజ్ నిర్ణయం కరెక్టుగానే పే చేస్తోంది. సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని చిత్రాల్లోకల్లా అత్యంత భారీ వ్యయంతో రూపొందిన చిత్రం నాన్నకు ప్రేమతో. జూనియర్ ఎన్టీయార్ హీరోగా సుమారు 50 కోట్ల పై చీలుకు బడ్జెట్ ఖర్చు చేయడంతో ఈ చిత్రాన్ని విపరీతమైన క్రేజ్ మీద బయ్యర్లు ఎగబడి కొన్నారు. లాభాలు అటుంచి కనీసం బ్రేక్ ఈవెన్ అవాలన్నా 55 నుండి 60 కోట్ల షేర్ వసూళ్లు రావాలి. మరి అంతటి సత్తా ఈ సినిమాలో ఉందా అన్నది ఇంకా మీమాంసే. అలాగే బాలకృష్ణ డిక్టేటర్ కూడా 40 కోట్ల షేర్ సాధిస్తే గానీ హిట్టు అనిపించుకోదు. ఇలా అన్నింటా ఓ మోస్తారు ఖర్చుతో 20 కోట్ల లోపే చుట్టేసిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. అటు కలెక్షన్లు, ఇటు జనాల నోటి మాట కూడా గొప్పగా ఉండడంతో వారం తిరిగేలోపే కనిష్టంగా 25 కోట్లు ఈ చిత్రం చెయ్యొచ్చు అన్నది ప్రాథమిక అంచనా. అదే కోవలో శర్వానంద్ చేసిన ఎక్స్ ప్రెస్ రాజా కూడా 10 కోట్ల లోపు బడ్జెట్ మీదే ఉండడం, వ్యాపార వర్గాలకు ఊరటనిచ్చే అంశం. 50 పెట్టి నష్టమో లేకపోతే ఏ 2 లేదా 3 కోట్ల లాభాలో చూడడం గొప్పా లేకపోతే 20 లోపు ఖర్చు చేసి 10 నుండి 15 కోట్లు వెనకేసుకోవడం గొప్పా. అందుకే ట్రేడ్ పరంగా చూసుకుంటే సోగ్గాడు, రాజాలే నిజమైన రాజాలు.