పండక్కి ఎటువంటి సినిమాకు వెళ్దాం అంటే, సకుటుంబ సపరివార సమేతంగా ఏదైతే చూడదగిందిగా ఉంటుందో అటువంటి దానికే ప్రేక్షకులు ఎక్కువగా ఓటు వేస్తుంటారు. అందుకే సంక్రాంతి వాతావరణాన్ని మొత్తాన్ని తన సినిమాలో నింపుకుని అక్కినేని నాగార్జున గారు సోగ్గాడే చిన్ని నాయన అంటూ మన ముందుకొచ్చారు. నాన్నకు ప్రేమతోలో విషయం అర్థం కాక కొందరు తలలు పట్టుకుంటే, డిక్టేటర్ రొట్ట మాస్ కావడం వీళ్ళకు ఇంకో తలనొప్పి అయ్యింది, ఇక ఎక్స్ ప్రెస్ రాజాకు ఈ హీరోలకు ఉన్నంత ఫాలోయింగ్ లేకపోవడం శాపం అయింది. ఫలితంగా సోగ్గాడే చిన్ని నాయనకు ఫ్యామిలీ జనాలు బారులు కడుతున్నారు. నిజానికి నాగార్జున గారు కూడా ఈ సినిమా ఎప్పుడో అక్టోబర్ నెలలోనే కంప్లీట్ అయినా అఖిల్ తదితర చిత్రాలకు అడ్డుకాకూడదని అలాగే సంక్రాంతి సీజన్ అయితే సినిమాకు కూడా అదనపు ఆకర్షణ వస్తుందని నమ్మి బరిలో దింపారు. ఆయన ఎంచుకున్న ప్రణాలిక బాగానే వర్కవుట్ అయింది, సోగ్గాడికి భలే కలిసొచ్చింది.