సంక్రాంతి దగ్గరకు వచ్చేసరికి ఈ సీజన్‌లో విడుదలకానున్న చిత్రాల హీరోలకు, నిర్మాత, దర్శకులకు ఇంత చలిలోనూ చెమటలు పట్టేస్తున్నాయి. ఈ వార్ ఆయా స్టార్స్‌ను లోపల లోపల వణికిస్తోంది. ఈ సంక్రాంతి సీజన్‌లో మూడు రోజుల్లో నాలుగు సినిమాలు విడుదల కానుండగా ఒక్కో సినిమాకి ఒక్కో టార్గెట్ ఫిక్స్ అయింది. ఇందులో ఎక్కువ టెన్షన్ జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'పైనే ఉంది. దాదాపు 50కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బిజినెస్ కూడా 50కోట్లు దాటింది. సో... ఈ చిత్రం 60కోట్లకు పైగానే కల్షెన్లు సాధిస్తేగానీ హిట్ అనిపించుకొని అందరికీ నాలుగు రాళ్లు మిగలవు. అందులోనూ ఈ చిత్రం ఎన్టీఆర్ 25వ చిత్రం కావడం మరింత విశేషం. సో... ఇప్పటివరకు 50కోట్ల క్లబ్‌లో చేరలేకపోయిన ఎన్టీఆర్ 'నాన్నకుప్రేమతో'తో తప్పనిసరిగా 50కోట్ల క్లబ్‌లో చేరాల్సిందే. మరి ఇది సాధ్యమవుతుందా? లేదా అనేది వేచిచూడాలి. ఇక బాలయ్య 'డిక్టేటర్' చిత్రం దాదాపు 30కోట్ల పై బడ్జెట్‌తో తెరకెక్కింది. బిజినెస్ కూడా 35కోట్ల వరకు జరిగింది. ఈ చిత్రంతో బాలయ్య కనీసం 40కోట్లు వసూలు చేయందే లాభం లేదు. ఇక నాగార్జున నటిస్తున్న 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం బడ్జెట్ 25కోట్లు. ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ 28కోట్లు జరిగింది. మరి ఈ చిత్రం 30కోట్లు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక శర్వానంద్ 'ఎక్స్‌ప్రెస్‌రాజా' టార్గెట్ 20కోట్లుగా ఫిక్స్ అయ్యారు. సో... శర్వానంద్ 20కోట్ల క్లబ్‌లో చేరితే కానీ ఈ చిత్రం టార్గెట్ రీచ్ కాలేదు. మరి వీటిల్లో ఏయే చిత్రాలు తాము ఫిక్స్ చేసుకున్న టార్గెట్‌ను ఛేదిస్తాయో వేచిచూడాలి...!