దర్శకరత్న దాసరి నారాయణ రావు గారంటే యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు. అలాగని దాసరి గారు కేవలం సినిమాలకే పరిమితం అవలేదు. రాజకీయాలలో చేరి ఉన్నతమైన పదవులు కూడా అధిష్టించారు. గత కొన్నాళ్ళుగా కోల్ గేటు స్కాం విషయంలో కాస్తంత మసిని పూసుకున్న దాసరి గారు ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారా అనిపించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఒకరేమో ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మరొకరేమో అటు సినిమా ఇటు రాజకీయంలో పండిపోయిన పెద్ద మనిషి. మరి వీరి భేటీలో రాజకీయాలు కాకుండా ఇంకో అంశం చర్చకు వచ్చే ఆస్కారమే లేదు. జగన్ గారే స్వయంగా దాసరి నివాసానికి వెళ్ళడం, దాదాపుగా అరగంట పైనే వీరి మధ్య సంభాషణ జరగడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. కొసమెరుపుగా జగన్ నిజంగా ప్రజల సమస్యలపైన పోరాడుతున్న యువ నాయకుడని దాసరి గారు కితాబునివ్వడం వెనక దాగున్న మర్మం ఏమిటి? మరి దాసరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? కుల సమీకరణాల మీద ఎక్కువగా ఆధారపడే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయంలో వీరిద్దరి కలయిక దేనికి దారి తీస్తుంది? ఎన్నో ప్రశ్నలకు రానున్న రోజుల్లో ఓ సమాధానం దొరకొచ్చు.