ముందుగా సంక్రాంతికి నాలుగు బడా సినిమాలు వస్తున్నాయంటే, ఏముందిలే అసలు సమయం వచ్చేసరికి ఏవైనా రెండు తప్పుకుంటాయి అని మనకు మనం సర్దిచెప్పుకున్నాం. ఎందుకంటే మన దర్శకుల, నిర్మాతల ప్లానింగ్ మీద అంత నమ్మకం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు పోస్ట్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ కార్యక్రమాల్లోనే వెనకబడి పోతారని ఊహించాం. కానీ ఇప్పుడేమో విచిత్రంగా నాలుగుకు నాలుగు, మేమెందుకు తగ్గాలి అన్నట్లుగా పోటీ పడుతూ సెన్సార్ బోర్డు ముందు నిలబడ్డాయి. ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ని నాయనలు సెన్సార్ పనులు ముగించుకొని రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా మార్కెట్లోకి వదిలేస్తే జస్ట్ ఒక్క గంట క్రితమే డిక్టేటర్ సెన్సార్ పరీక్ష మొదలయింది అన్న వార్త చెవిన బడింది. అలాగే రానున్న రెండు రోజుల్లో నాన్నకు ప్రేమతో చిత్రాన్ని కూడా సెన్సార్ వారి ముందు ప్రదర్శించేందుకు సుకుమార్ రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాడు. కొద్దిపాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉన్నాయి కనక ఈరోజు, రేపు చెమట చిందితే ఎల్లుండి నుండి ఫ్రీ అయిపోతాం అన్నట్లుగా పనితో కుస్తీ పడుతున్నారంట. అంటే ఇక సంక్రాంతి పండక్కి నాలుగింటితో మనకు రచ్చ రంబోలానే!