సినిమా సినిమాకీ కనీసం రెండు వారాలైనా గ్యాప్ ఉండాలని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతుంటాయి. కానీ సంక్రాంతికి మాత్రం వారం రోజుల వ్యవధిలో ఏకంగా నాలుగు సినిమాలొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఇటీవల కాలంలో అస్సలు ఎరగం. ఒకే కుటుంబం నుంచి రెండు సినిమాలు పోటాపోటీగా విడుదలవుతుండటం పరిశ్రమ వర్గాల్నే కాదు, అభిమానుల్నీ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఏ సినిమాకి ఎన్ని వసూళ్లు దక్కుతాయన్నదే ఇప్పుడు ప్రశ్న. ఉన్నదే 1600 థియేటర్లు. వీటిలో ఏ సినిమా ఎన్ని థియేటర్లలో విడుదలవ్వాలి? ఒకొక్క సినిమా వెయ్యికి థియేటర్లలో విడుదలైనా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాని పరిస్థితుల్ని చూస్తూనే ఉన్నాం. కానీ సంక్రాంతిని దృష్టిలో ఉంచుకొని నలుగురు నిర్మాతలు సాహసానికి పూనుకొన్నారు. తగ్గేదే లేదంటూ తమ సినిమాల విడుదల తేదీల్ని ప్రకటించేశారు. మరి వీటిలో ఏ సినిమా ఎలాంటి ఫలితం దక్కించుకొంటుందో చూడాలి. అయితే ఇప్పుడు ఆయా సినిమాలకి థియేటర్లు సర్దే విషయంలో ఆ నలుగురు తలలు పట్టుకొంటున్నట్టు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు నలుగురు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఆ నలుగురు ఎవరో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈసారి నలుగురు నిర్మాతలూ కావల్సిన వాళ్లే కావడం, ముగ్గురు స్టార్ కథానాయకుల చిత్రాలు కావడంతో ఏ సినిమాకి థియేటర్లు ఇవ్వకపోయినా వ్యవహారం తేడా అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఆ నలుగురు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నారట. అయితే మధ్యేమార్గంగా ఎవ్వరికీ చెడ్డకాకుండా థియేటర్లను సమంగా పంచాలనే ఓ నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది. దిల్‌రాజు అయితే ఇప్పటికే ఆయా నిర్మాతలకి థియేటర్ల వివరాల్ని కూడా ప్రకటించేశాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాలకి అత్యధికంగా థియేటర్లు దక్కబోతున్నాయని, ఎక్స్‌ప్రెస్ రాజా మాత్రం రెండొందల లోపు థియేటర్లలోనే విడుదల కానుందని సమాచారం.