నందమూరి నటసింహంగా నందమూరి అభిమానులు పిలుచుకునే బాలకృష్ణ తన గురించి, తన తండ్రి గురించి తనకు తానే గొప్పలు చెప్పుకొంటూ స్వోత్కర్ష మొదలుపెట్టాడు. త్వరలో విడుదల కానున్న 'డిక్టేటర్' గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలయ్య పైరసీ గురించి మాట్లాడుతూ... పైరసీ, గైరసీలు జాన్తానై. అవన్నీ మనకు పడవు. మా సినిమాలను టీవీలు, సీడీల్లో చూస్తే పెద్దమజా రాదని, పెద్ద స్క్రీన్లలో చేస్తేనే తమ సినిమాలు మజానిస్తాయని.. అంటున్నాడు. ఇంకా మాట్లాడుతూ.. కొన్ని సందర్భాల్లో స్టేజీలపైనా, సినిమాల్లోనూ తాను చెప్పే డైలాగుల నుండి ఓ పాయింట్ పట్టుకుని, తన బాడీలాంగ్వేజ్‌కు అనుగుణంగా రచయితలు కథలు రాస్తారని బాలయ్య చెప్పుకొచ్చాడు. తెలుగు సినిమా ప్రేక్షకులు నందమూరి సినిమాల్లో డైలాగులనే బాగా ఎంజాయ్ చేస్తారని, అందుకే తమ సినిమాల్లో డైలాగులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్నారు. థియేటర్లలో తెర ముందు డాన్సులు, పూజలు, ఈలలు, గోలలు, కాగితాలు విసరడం వంటి సంప్రదాయాలు నందమూరి ఫ్యామిలీ సినిమాలతోనే మొదలైందన్నారు. అది బిసీ సెంటర్స్ అయినా, 70ఎం.ఎం. థియేటర్లైనా, మల్టీప్లెక్స్ మాల్స్ అయినా సందడి ఉండాల్సిందే అన్నాడు. అప్పట్లో తన తండ్రి గారి సినిమాలకు బళ్లు కట్టుకొని మరీ వెళ్లి సినిమాలు చూసేవారని, ఆ తర్వాత ఆ సంప్రదాయం తనకు మాత్రమే కొనసాగిందని ఆయన అంటున్నాడు. మొత్తానికి నందమూరి పైత్యం రోజురోజుకూ ఎక్కువవుతోందని ఈ వ్యాఖ్యలు విన్న వారు చెవులు కొరుక్కుంటున్నారు.