అద్భుతమైన ప్రయోగాలు చేయాలన్నా, లేదా పరమ రొటీన్ చిత్రాలను తీయాలన్నా.. అది తమిళ ఇండస్ట్రీ వారికే సాద్యమవుతుందని నిస్సంకోచంగా చెప్పవచ్చు. కాగా ఇప్పుడు తమిళంలో వైరస్, మెడికల్ మాఫియా, సైన్స్ ఫిక్షన్ కథలకు డిమాండ్ పెరుగుతోంది. 'రోబో' తరహాలోనే శంకర్ తీస్తున్న 'రోబో2.0' కూడా పూర్తి సైన్స్ ఫిక్షన్ సినిమానే. ఇక సూర్య మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న '24' చిత్రం కూడా సైన్స్ ఫిక్షనే. ఇది టైమ్ మెషీన్ ఆధారంగా రూపొందుతున్న చిత్రం. దీనికి 'మనం' దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. కాగా ఇటీవల విడుదలైన జయం రవి 'తని ఒరువన్' డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే చిత్రమే కావడం విశేషం. ఈ చిత్రం తమిళనాడులో సంచలన విజయం సాధించి, తెలుగుతో పాటు అన్ని భాషల వారిని ఆకట్టుకున్న చిత్రం కావడం చెప్పుకోదగిన విషయం. ఇక శంకర్ కిందటి చిత్రం 'ఐ' కూడా వైరస్, సైన్స్ ఫిక్షన్‌తో రూపొందిన చిత్రమే కావడం గమనార్హం. ఇందులో విక్రమ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా జయం రవి 'తని ఒరువన్' తర్వాత చేస్తున్న 'మిరుధన్' చిత్రం కూడా ఇలాంటి కథాంశంతోనే రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొత్తం మీద తమిళంలో ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ తరహా చిత్రాలకు భారీ క్రేజ్ ఏర్పడింది.