తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి మంచి సీజనే. దీన్ని ఎవ్వరూ కాదనరు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా సంక్రాంతికి కేవలం ఇద్దరు స్టార్స్ నటించిన చిత్రాలు మాత్రమే పోటీపడుతూ వస్తున్నాయి. కానీ ఈసారి ఆ సంఖ్య అనూహ్యంగా మూడు నాలుగు చిత్రాలకు పెరగడంతో అటు సినిమా ప్రియులకు ఇది మంచి సంతోషకరమే అయినా నిర్మాతలకు, హీరోలకు మాత్రం కంటి నిండా నిద్రలేకుండా చేస్తోంది. మొదట ఈ ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ 'డిక్టేటర్', ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' చిత్రాలు పోటీపడనున్నాయి అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయన'తో ఈ సంఖ్య మూడుకు చేరింది. మరోపక్క చూడటానికి చిన్న చిత్రమే అయినప్పటికీ మేర్లపాకగాంధీ దర్శకత్వంలో యూవి క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న 'ఎక్స్‌ప్రెస్‌రాజా' కూడా సైలెంట్ కిల్లర్‌గా మారునుందనే విషయం కన్‌ఫర్మ్ అయింది. వాస్తవానికి స్టార్ హీరోల చిత్రాలు అంటే కనీసం 1000 నుండి 1500ల లోపు థియేటర్లలో విడుదలవుతాయి. బాలయ్య 'లెజెండ్' చిత్రం ఎనిమిది వందల పైచిలుకు స్క్రీన్లలో రిలీజ్ అయింది. ఇక 'టెంపర్' చిత్రం 1000కి పైగా స్క్రీన్లలో విడుదలైంది. 'డిక్టేటర్' చిత్రాన్ని నైజాంలో దిల్‌రాజు తీసుకునే ప్రయత్నాలలో ఉండడంతో పాటు ఈ చిత్రాన్ని ఈరోస్ సంస్థ ఫైనాన్స్ చేస్తుండటంతో పాటు ముందుగానే దాదాపు 1000 థియేటర్లను ఈ సినిమా కోసం బ్లాక్ చేశారని ట్రేడ్‌వర్గాల సమాచారం. మరోవైపు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కూడా తన 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని కనీసం 1200 స్రీన్లలో రిలీజ్ చేయనున్నాడు. రిలయన్స్ సంస్థ కూడా ఆ చిత్రాన్ని భారీగా విడుదల చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇక నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం విషయంలో నాగ్ కూడా మొండిగా ముందుకు వెళుతున్నాడు. ఇక 'రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు' వంటి చిత్రాల తర్వాత శర్వానంద్ 'ఎక్స్‌ప్రెస్‌రాజా'తో మధ్యలో దూరిపోయి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అసలు సంక్రాంతి రేసులో ఉన్న ఈ చిత్రాలకు తగినన్ని ధియేటర్స్ అందుబాటులో ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. ఇక కలెక్షన్లు కూడా ఎక్కువ సినిమాలు విడుదలకానుండటంతో ఏ సినిమాకి గుంపగుత్తగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సో.. ఓపెనింగ్స్ విషయంలో కూడా అన్ని చిత్రాల మద్య కలెక్షన్లు తగ్గిపోతాయి. వాస్తవానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే థియేటర్లు 2000 కూడా లేవు. మరి ఈ పోటీ వల్ల అన్ని సినిమాలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉన్నది అని చెప్పడం అతిశయోక్తికాదు..!