ఒక్క అల్లుశిరీష్ తప్ప మెగాఫ్యామిలీ నుండి హీరోలుగా పరిచయం అయిన ఎవ్వరూ ఫెయిల్ కాలేదు. ప్రతి ఏడాది వీరిలో ఎవరో ఒకరు నటించిన చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలుస్తూనే ఉన్నాయి. కానీ గత ఏడాది (2015)లో మాత్రం ఏ మెగాహీరో కూడా తన స్థాయికి తగ్గ విజయాన్ని నమోదు చేయలేకపోయారు. 'బాహుబలి, శ్రీమంతుడు' చిత్రాలతో ప్రభాస్, మహేష్‌బాబులు మెగాహీరోల హవాకు కొద్దిగా గండి కొట్టారు. దీంతో మెగా హీరోల ఆశలన్నీ కొత్త సంవత్సరం అయిన 2016పైనే ఉన్నాయి. పవన్‌కళ్యాణ్ నటించిన మల్టీస్టారర్ మూవీ 'గోపాల గోపాల' చిత్రం యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఇక సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్‌లు నటించిన 'పిల్లా...నువ్వులేని జీవితం, కంచె' చిత్రాలు ఫర్లేదనిపించాయి. ఇక 'లోఫర్' చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. నిన్న మొన్నటివరకు 'అత్తారింటికి దారేది, మగధీర, గబ్బర్‌సింగ్, రేసుగుర్రం'లదే హవా. అయితే ఈసారి 50కోట్లు పైగానే వసూలు చేసిన అల్లుఅర్జున్ 'సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి' పెట్టుబడికి తగ్గ విజయాలను నమోదు చేయలేకపోయాయి. రామ్‌చరణ్ నటించిన 'బ్రూస్‌లీ' చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. నిన్నటివరకు టాప్ 5లో ఉన్న చిత్రాల్లో రెండు సినిమాలు ఔట్ అయిపోయాయి. 'బాహుబలి, శ్రీమంతుడు' చిత్రాలు మొదటి రెండు స్థానాలు ఆక్రమించడంతో 'అత్తారింటికి దారేది' కేవలం మూడో స్థానంతో సరిపెట్టుకుంటోంది. మరి కొత్త ఏడాదిలో పవన్‌కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్‌సింగ్'తో పాటు రామ్‌చరణ్ 'తని ఒరువన్' రీమేక్‌లతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించే 'కత్తి' రీమేక్ కూడా ఇదే ఏడాది ఆరంభమై, ఇదే ఏడాది విడుదల కానుంది. వీరితో పాటు బన్నీ 'సరైనోడు', సాయిధరమ్‌తేజ్ 'తిక్క, సుప్రీమ్' చిత్రాలు, వరుణ్‌తేజ్ నటించే చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. మరి 2016లో అయినా మెగాహీరోలు రికార్డులను బద్దలు కొట్టే చిత్రాలు చేస్తారో లేదో చూడాలి...!