కష్టపడి సంపాదించుకున్న క్రేజ్ మొత్తం ఒక్క సినిమాతో మట్టిలో కలిసిపోతే ఎవరికి బాధగా ఉండదు చెప్పండి. హ్యాపీ డేస్ తరువాత ఎన్నో గడ్డు రోజులు ఎదుర్కొన్న నిఖిల్ తనకు నప్పే జోనర్ ఏంటని తెలుసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసి ఎట్టకేలకు స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్యలతో ఓ హీరోగా నిలదొక్కుకున్నాడు. కానీ ఇంతలో కోన బ్రాండ్ వ్యాల్యూ మీద మనసు పడి శంకరాభరణం ఒప్పుకొని పెద్ద తప్పిదమే చేసానని కొంచెం ఆలస్యంగా పసిగట్టాడు. శంకరాభరణం చేసిన డ్యామేజీని కవర్ చేసుకోవడానికి అన్నట్లుగా నిఖిల్ ఇప్పుడు టైగర్ ఫేం VI ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నాడు. విశేషం ఏమిటంటే ఈ పేరు పెట్టని చిత్రానికి ఖర్చు చేయాల్సిన బడ్జెటుకి, నిఖిల్ కమర్షియల్ స్టామినాకి అసలు పొంతన కుదరడం లేదంట. ముగ్గురు హీరోయిన్లు అవసరమయ్యే ఈ కథలో VFX ఖర్చు కూడా ఎక్కువేనట. హిట్టుల మీదున్న హీరో పైన అయితే ఎంత పెట్టడానికైనా సిద్ధపడిపోయే నిర్మాతలు శంకరాభరణం రెవిన్యూ చూపించి నిఖిల్ బుర్ర తిరిగిపోయేట్టు చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. దీనర్థం నిఖిల్ పారితోషికం తగ్గించుకోమనా లేక సినిమాను కాంప్రమైజ్ అయ్యి అనుకున్న బడ్జెటులో నాసిరకంగా కంప్లీట్ చేద్దమానా?