జాతీయ స్థాయిలో గుర్తింపున్న మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఐదు పదుల వయసుదాటినా.. ఇప్పటికీ కుర్రాళ్లకి పోటీనిస్తూ సూపర్ స్టార్‌డమ్‌తో కొనసాగుతున్నారాయన. చాలా రోజుల తర్వాత మరోసారి తెలుగులో నటించడానికి ఒప్పుకొన్నారు. ఒకేసారి రెండు చిత్రాలకి ఆయన పచ్చజెండా ఊపారు. అయితే ఈసారి తెలుగు నేర్చుకొని మరీ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారాయన. ప్రస్తుతం తెలుగుకోసమని ట్యూటర్‌ని నియమించుకొన్నాడట. త్వరలోనే తెలుగు మాట్లాడేస్తానని ఆయా చిత్రబృందాలకి చెబుతున్నాడట. నిజంగా మోహన్‌లాల్ చిత్తశుద్ధికి హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది కదూ! దర్శకుడు చెప్పిందేదో చేసేసి పారితోషికం తీసుకొని వెళ్లిపోదామనుకొనేవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్న ఈ సమయంలో పాత్ర కోసమని భాష నేర్చుకొని మరీ నటించాలని నిర్ణయించుకొన్న మోహన్‌లాల్ చిత్తశుద్ధికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
చంద్రశేఖర్ యేలేటి, కొరటాల శివ చెప్పిన పాత్రలే మోహన్‌లాల్‌ని తెలుగు నేర్చుకొనేలా చేశాయని సమాచారం. చంద్రశేఖర్ యేలేటి 'మనమంతా' పేరుతో ఓ చిత్రం చేస్తున్నాడు. మల్టీస్టారర్ చిత్రంగా రూపొందుతున్న అందులో మోహన్‌లాల్ బలమైన పాత్ర పోషిస్తున్నాడట. ఆ పాత్ర ఆయనకి విపరీతంగా నచ్చిందట. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతున్న కొత్త చిత్రంలోనూ ఓ కీలకమైన పాత్రని మోహన్‌లాల్ చేస్తున్నారు. అందులోనూ ఆయనది చాలా కీలకమైన పాత్ర అట. ఇలాంటి పాత్రల్ని రక్తి కట్టించాలంటే భాషపై పట్టు పెంచుకోవల్సిందే అని మోహన్‌లాల్ గట్టిగా నమ్మారట. అందుకే ఇప్పుడు తెలుగు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.