నేడు స్టార్‌హీరోలే ఏకంగా కామెడీలు చేస్తుండే సరికి ప్రత్యేకంగా కామెడీహీరోల సినిమాలు చూడటానికి హాస్యప్రియులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనికి మంచి ఉదాహరణ అల్లరినరేష్, సునీల్‌ల చిత్రాలు. అల్లరి నరేష్ విషయానికి వస్తే ఆయన 'సుడిగాడు' తర్వాత మరో హిట్ కొట్టలేకపోయాడు. కనీసం హిట్టు కాదు కదా...! కనీసం యావరేజ్‌గానైనా ఆయన నటించిన చిత్రాలు నిలబడటం లేదు. నిన్నామొన్నటివరకు మినిమం గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్న ఆయన సినిమాలంటే ఇప్పుడు బయ్యర్లు పారిపోతున్నారు. ఆయన ఎంతగానో ఎన్నో ఆశలు పెట్టుకున్న తన 50వ చిత్రం 'మామ మంచు.. అల్లుడు కంచు' సినిమాపై ఆయన గంపెడాశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో తనకు తోడుగా మోహన్‌బాబు ఉండటం, అందునా ఇది ఓ రీమేక్ చిత్రం కావడంతో ఆయన ఆశలు నిజమవుతాయని అందరూ ఆశించారు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఈ చిత్రంలోని కామెడీ తుస్సుమంది. ఇటు అల్లరినరేష్‌గానీ, అటు మోహన్‌బాబు గానీ ప్రేక్షకులను తమ కామెడీతో నవ్వించలేదు సరికదా నవ్వులపాలయ్యారు. మరి అసలే యువహీరోల మధ్య కాంపిటీషన్ హెవీగా ఉంది. దానికి తగ్గట్లుగా ప్రతిహీరో తన కామెడీతో పాటు యాక్షన్, స్టెప్స్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మరి ఈ పోటీలో అల్లరినరేష్ ఇప్పటికే వెనకపడిపోయాడు. ఇక అల్లరినరేష్ మరలా తన పూర్వ వైభవం సాధించాలంటే ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉందని, ఇప్పటికైనా మూస కామెడీకి గుడ్‌బై చెప్పాల్సిన టైమ్ వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.